సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ బాటలో మక్కల్ దళపతి విశాల్ ప్రత్యేక రాజకీయ పార్టీ మీద దృష్టి పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తమిళనాట స్థానిక ఎన్నికల నగారా మోగినానంతరం పార్టీ ప్రకటన అన్నట్టు విశాల్ ఆదివారం మదురైలో స్పందించారు.
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ పార్టీలకు కొదవలేదన్న విషయం తెలిసిందే. ప్రతి సామాజిక వర్గానికి ఓ పార్టీ తప్పని సరి. సినిమా స్టార్ల పార్టీలూ అనేకం ఉన్నాయి. ఇందులో కరుప్పు ఎంజీయార్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, సుప్రీం హీరో శరత్‌కుమార్ నేతృత్వంలోని ఎస్‌ఎంకేలు కొంత మేరకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి ఉన్నాయి. ఇక, దర్శకుడు, నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ప్రజలమదిని కొల్లగొట్టే విధంగా ఓటు బ్యాంక్‌ను దక్కించుకుంటూ వస్తున్నదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో అమ్మ జయలలిత మరణం తమిళనాట రాజకీయాల్లో కొత్త పయనానికి దారి తీశాయి. అన్నాడీఎంకే ముక్కలు కావడం ఓ వైపు ఉన్నా, మరో వైపు ఆ బలగం తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లూ ఎక్కువే.
ఇందులో భాగంగా సినీ స్టార్లు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టే పనిలో పడ్డారు. ఇందులో ముందు వరుసలో విశ్వనాయకుడు కమల్ ఉన్నా, లేటుగా వచ్చినా లేటెస్టు అన్నట్టుగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ కసరత్తుల వేగం పెరిగింది. ఈ ఇద్దరి పార్టీల మీద అందరి దృష్టి మరలింది. రజనీకాంత్‌కు మద్దతుగా అభిమాన సేన దూసుకు వెళ్తుంటే, కమల్ పార్టీ ప్రకటన రాష్ట్ర పర్యటనలో ఉండ వచ్చన్న సంకేతాలు ఉన్నాయి.
అదే సమయంలో శరత్, సీమాన్ ఏకం అవుతూ సినిమా కూటమి అన్నట్టుగా సినీ పార్టీలన్నీ ఏకం చేయడానికి తగ్గ కసరత్తులు సాగుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాను సైతం అంటూ విశాల్ రాజకీ య పార్టీ కసరత్తులకు సిద్ధ పడుతుండడం గమనార్హం. ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నామినేషన్ దాఖలు సమయంలో రాజకీయాలకు అతీతం అని విశాల్ వ్యాఖ్యానించారు. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురి కావడం ఓ వైపు ఉన్నా, మరో వైపు ప్రజలకు మంచి చేయాలన్న తపన ఆయనలో రోజురోజుకు పెరగడం విశేషం. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధమని ఇప్పటికే ఓ మారు ప్రకటించిన ఆయన మరోమారు అదే వ్యాఖ్యల్ని స్పందిస్తూ, రాజకీయ పార్టీ పెడతానన్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించడం గమనార్హం.
నగారాతో పార్టీ: అభిమానుల చేత మక్కల్ దళపతిగా ముద్ర వేసుకున్న సినీ నటుడు విశాల్ మదురై విమానాశ్రయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో రాజకీయంగా తీవ్రంగానే స్పందించారు. బసు చార్జీల పెంపును ఖండించారు. మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో జరిగిన అగ్ని ప్రమాదం వంటి ఘటన మరోసారి ఎక్కడ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అలాగే, రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీ పెడతారా అని ప్రశ్నించగా, తమిళనాడులో స్థానిక ఎన్నికల నగారా మోగగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మళ్లీ రాజకీయ పార్టీ ప్రస్తావనను మీడియా తీసుకు రాగా, ఏడాదిన్నరగా వాయిదాల పర్వంతో సాగుతున్న స్థానిక ఎన్నికల నగారా ముందు మోగనివ్వండి, ఆ తదుపరి పార్టీ అని వ్యాఖ్యానించారు. కావేరి జల వివాదంపై రజని, కమల్ స్పందించాల్సిన అవసరముందని విశాల్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment