సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్‌పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్‌పై చర్చకే పరిమితం కావాలని సూచించారు.
ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్
► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు.
► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు.
► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు.
చంద్రబాబుకు, చైర్మన్‌కూ గెడ్డం ఉంది..
► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్‌కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు.
► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.
► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు.
► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది.
మండలిలో మాటల యుద్ధం
Published Thu, Jun 18 2020 5:26 AM | Last Updated on Thu, Jun 18 2020 7:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment