
సాక్షి, న్యూఢిల్లీ : ‘కేంద్ర పాలిత ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, సంస్కతి, స్థానిక హీరోలు, ఆర్థిక, మతపరమైన ప్రాముఖ్య అంశాలు, అక్కడ పండే ప్రధాన పంటలు, ముఖ్య పరిశ్రమల తదితర వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించండి’ అంటూ ‘నీతి ఆయోగ్’కు చెందిన పింకీ కపూర్ అనే అధికారి ఏప్రిల్ 8వ తేదీన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్‌కు, ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఈ మెయిల్ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్యటన నేపథ్యంలో ఆయన ఈ మెయిల్‌ను పంపారు. అంటే ప్రధాని ఎన్నికల ప్రసంగంలో ప్రస్తావించేందుకు ఈ వివరాలు అడిగినట్లు సులభంగానే అర్థం అవుతోంది.
అంతకుముందు ‘నీతి ఆయోగ్’ నుంచి బీజేపీ పాలిత మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు మార్చి 31వ తేదీన ఇలాంటి ఈ మెయిలే వెళ్లింది. అలాగే మహారాష్ట్రలోని వార్ధా, లాథూర్ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇలాంటి ఈ మెయిల్స్ వెళ్లాయని వారి నుంచి వచ్చిన లేఖల ద్వారా స్పష్టం అవుతోంది. గోండియా సంక్షిప్త చరిత్ర, భౌగోళిక స్వరూపం, మతాల ప్రాతిపదికన జనాభా శాతం తదితర విరాలతో ‘ప్రధాన మంత్రి కార్యాలయానికి గోండియా జిల్లా సంక్షిప్త సమాచారం’ అనే శీర్షికతో అక్కడి జిల్లా కలెక్టర్ పంపించారు. లాథూర్‌కు సంబంధించిన చరిత్ర, చారిత్రిక కట్టడాలు, ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల వివరాలను తెలియజేస్తూ అక్కడి కలెక్టర్ కూడా లేఖను పంపించారు. వార్ధా జిల్లా కలెక్టర్ నుంచి అలాంటి సమాచారమే అందింది.
‘వార్ధా డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఫర్ పీఎంవో’ అనే శీర్షికతో పంపిన ఆ లేఖలో ఆ ప్రాంతాన్ని భారత స్వాతంత్య్ర సమర యోధులు మహాత్మా గాంధీ, వినోబాభావే లాంటి వారు సందర్శించి కొంతకాలం అక్కడ గడిపనట్లుగా వివరాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ ఒకటవ తేదీన వార్ధా, మూడవ తేదీన గోండియాలో, ఏప్రిల్ 9వ తేదీన లాథూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని ఆయన అక్కడక్కడ సందర్బోచితంగా ప్రస్తావించారు.
మార్చి 10వ తేదీ నుంచే ఎన్నికల కోడ్
మార్చి పదవ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అంటే ఆ నాటి నుంచి ప్రధాన మంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారెవరూ కూడా అధికారిక కార్యక్రమాలతో పార్టీ ప్రచార కార్యక్రమాలను ముడిపెట్ట రాదు. ఎన్నికల ప్రచారం కోసం అధికార యంత్రాంగం సేవలను ఏమాత్రం ఉపయోగించుకోరాదు. అలాంటప్పుడు ప్రధాని కార్యాలయానికి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ సమాచారం కోసం జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయడం ఏమిటీ ? ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ అధికారులుగా కీలక బాధ్యతలు నిర్వహించే కలెక్టర్లు కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం ఏమిటీ? వారి చర్య ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కాదా ? ఇదే విషయమై మహారాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి దిలీప్ షిండేను మీడియా ప్రశ్నించగా, ఈ విషయాలేవి తన దష్టికి రాలేదని తప్పించుకున్నారు.
ఎన్నికల కోడ్ స్ఫూర్తి ఏమిటంటే!
‘పదవుల్లో ఉన్న వారు ఎవరైనా ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షించాలి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను అందులో పోటీచేసేవాళ్లు శంకించేలా, లేదా సందేహించేలా ఎవరు ప్రవర్తించకూడదు, ప్రవర్తించారన్న సందేహం కలిగేలా కూడా వ్యవహరించరాదు’ అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నరేంద్ర బుటోలియా స్పష్టం చేశారు. అధికార హోదాలో ఉండి రాహుల్ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్ యోజన’ పథకాన్ని విమర్శించినందుకు ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో నరేంద్ర బుటోలియా ఇలా స్పందించారు.
అనేక ఆరోపణలు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఇప్పటి వరకు పాలకపక్ష బీజేపీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కోడ్ అమల్లోకి వచ్చాక ‘నమో టీవీ’ ప్రసారాలను ప్రారంభించడం అందులో ఒకటి. ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ లైసెన్స్ లేకుండా ఆ టీవీ ప్రసారాలు కొనసాగడం అశ్చర్యం. రాహుల్ గాంధీని విమర్శించే విషయంలో మత పరమైన అంశాలను ప్రస్తావించి కోడ్ ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ పలు రాష్ట్రాల గవర్నర్లపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెల్సిందే.
(చదవండి : ‘నమో టీవీ’ ఎలా వచ్చింది ?)
Comments
Please login to add a commentAdd a comment