
లక్నో : నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీ రోజులకంటే మరింత దిగజారిపోయిందని మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో జరిగిన లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వచ్చింది. ఇప్పుడు మనమంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పటికి మనం మెల్కొనకపోతే దేశంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ప్రజాస్వామ్య రక్షణ కోసం అంతా కలిసి కృషి చేయాలి’అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాల కూటమి ఎలాగైతే గెలిచిందో అలాగే 2019ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల కూటమి పక్కాగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
పేరుకే మంత్రులు కానీ..
కేంద్ర కేబినేట్‌లోని అన్ని శాఖలను నరేంద్రమోదీ ఒక్కరే నిర్వహిస్తున్నారని యశ్వంత్ ఆరోపించారు. పేరుకే వివిధ శాఖలకు మంత్రులను నియమించారు, కానీ అధికారాలు మాత్రం వారికి ఇవ్వలేదని విమర్శించారు.‘ రాఫెల్ ఒప్పందం జరుగుతుంది కానీ రక్షణ మంత్రికి లెలియదు. నోట్ల రద్దు జరిగుతుంది కానీ ఆర్థిక మంత్రికి కేబినేట్ మీటింగ్‌కి వచ్చేదాకా తెలియదు. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తారు కానీ ఆ విషయం హోం మంత్రికి తెలియదు, ఇది ప్రస్తుత కేంద్ర మంత్రుల పరిస్థితి’ అని యశ్వంత్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రధాని నరేంద్ర మోదీ విదేశి పర్యటనకు సంబంధించిన సదుపాయాలను మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఆమెను ప్రజలు ట్విటర్ మంత్రి, వీసా మంత్రి అని మాత్రమే గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపిని ఓడించి ప్రజాస్వామ్యాని రక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment