తనను గద్దె దించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్– జేడీఎస్ కూటమిపై యడ్యూరప్ప శాపనార్థాలు సంధించారు. పూర్తి మెజారిటీ వస్తేనే రైతు రుణమాఫీ అని కుమారస్వామి చెప్పడం సరికాదని, తక్షణం రైతు రుణాలను మాఫీ చేయకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
శివాజీనగర: ఎన్నికలకు ముందు జేడీఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతుల రుణమాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలతో కలసి పోరాటం చేపడతామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప హెచ్చరించారు. బుధవారం నగరంలో ఆనందరావు సర్కిల్‌లోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నూతన సర్కారుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహించారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రజా వ్యతిరేకమైనదని ఆరోపించారు. యడ్యూరప్ప మాట్లాడుతూ కొత్త కూటమి ప్రభుత్వం 6 నెలలకు మించి అధికారంలో ఉండకపోవచ్చని జోస్యం చెప్పారు.
ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగిన కూడా తమ పార్టీ అధిక మెజారిటీతో అధికారం చేపడుతుందని ప్రకటించారు. మంత్రి మండలి విస్తరణ చేపడితే ఏమవుతుందోనని ఈ రెండు పార్టీల నాయకులకు భయం పట్టుకుందని యడ్డి విమర్శించారు. అందువల్లే ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మంత్రిమండలి విస్తరణే జరిగితే ఎలాంటి విభేదాలు తలెత్తుతాయనేది వేచి చూడాలని అన్నారు. రెండు పార్టీల్లో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైనా కూడా అవకాశవాద రాజకీయం చేస్తున్న కాంగ్రెస్–జేడీఎస్‌ల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని కార్యకర్తలకు సూచించారు.
తక్షణమే రుణమాఫీ చేయాలి
తక్షణమే రుణమాఫీ చేయాలని నూతన ముఖ్యమంత్రిహెచ్.డీ.కుమార్‌స్వామిని యడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే రైతుల రుణమాఫీ చేసేవాడినని ఆయన చెప్పటం సరైన విధానం కాదని ఆక్షేపించారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం తమ కర్తవ్యమని, దీనిని నిర్లక్ష్యం చేస్తే అన్నదాత వీధిన పడతాడని హెచ్చరించారు. పాము–ముంగిసలా ఆరోప–ప్రత్యాపరోణలతో దెబ్బలాడిన రెండు పార్టీలు ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఏనుగుతో ప్రేమ, కాంగ్రెస్‌తో పెళ్లి
సీనియర్ నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ జేడీఎస్‌తో కలసినవారు ఎవరూ అభివృద్ధి చెందలేదని, గతంలో మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, సిద్ధరామయ్యలకు ఏం జరిగిందన్నది తెలియనిది కాదని ధ్వజమెత్తారు. జేడీఎస్‌కు ఏనుగుతో ప్రేమ పుట్టింది, ఓవైసీతో డేటింగ్ అయింది, కాంగ్రెస్‌తో పెళ్లయింది.. అని హేళన చేశారు. ఈ ధర్నాలో లోక్‌సభ సభ్యులు శోభాకరంద్లాజె, పీ.సీ.మోహన్, ఎమ్మెల్యేలు ఎస్.ఆర్.విశ్వనాథ్, అశ్వథ్ నారాయణ, మాజీ మంత్రి కట్టా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment