
పులివెందుల: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ, టీడీపీ దొంగ నాటకాలాడుతున్నాయని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం మొదటినుంచి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ మొదటినుంచి ఒకే మాట మీద నిలబడి ఉంటే ఈ పాటికి హోదా వచ్చేది కాదా అని ప్రశ్నించారు.
కేంద్రం ప్యాకేజీ ప్రకటించినప్పుడు హోదా కంటే ఎక్కువే మేలు చేశారని ఇదే చంద్రబాబు హర్షం వ్యక్తం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను బలంగా కోరుతుండటంతో చంద్రబాబు బీజేపీతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకుని యూటర్న్ తీసుకున్నారన్నారు. అందులో భాగంగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ 13సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే పట్టించుకోని స్పీకర్ టీడీపీ అవిశ్వాస తీర్మానం ఒక్కసారి పెట్టగానే ఆమోదించడంలో ఉన్న మతలబు ఏమిటో అర్థం కాలేదన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment