ధర్నా చేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజిబిలిటీ లేదంటూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కడప అంబేడ్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదంటూ 2014 జూన్‌లోనే సెయిల్ నివేదిక ఇచ్చిందని, ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లే కేంద్రం మళ్లీ మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసిందన్నారు.
ఆ కమిటీ అధ్యయనం చేసి కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో 130 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉందని, దీంతో నలభై, యాభై ఏళ్లు పరిశ్రమను లాభదాయకంగా నడపవచ్చని నివేదిక ఇచ్చిందన్నారు. మెకాన్ నివేదికలో ఉన్నవాటిపై స్పందించని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టుకు నివేదించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదంటూ 2014లోనే నివేదిస్తే.. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన టీడీపీకి అది కనిపించకపోవడం విచారకరమని అవినాష్‌రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినపుడు తమతో కలిసి రాకుండా ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి టీడీపీ నేతలు దీక్షలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన ద్రోహం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దానికి సహకరించిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నేతలు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. కడపకు ఉక్కుపరిశ్రమ రాదని చంద్రబాబుకు ముందే తెలిసినా.. ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని విమర్శించారు. ధర్నాలో నేతలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment