సాక్షి, కొత్తవలస(విజయనగరం) : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘అరకు ఎమ్మెల్యే ఒక దుర్ఘటనలో మృతి చెందడం మనందరికి తెలిసిన విషయమే. ఆ ఎమ్మెల్యే మన పార్టీ వదిలి మనకు మోసం చేసినప్పటికి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో నడుస్తుండగా.. ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. 2004 ఎన్నికలు తప్పా ప్రతీసారి తెలుగుదేశం గెలిపించామన్నా. ఈ ముప్పై ఏళ్లలో కనీసం మూడంటే మూడు గుర్తుకుపెట్టుకునే పనులు చేయలేకపోయారన్నా అని చెప్పారు. కొత్తవలస, వేపాడు మండలాలు కరువు ప్రాంతాలు.
పోలవరం పూర్తి అయితే..
రైవాడ, తాటిపూటి రిజర్వాయర్ల నీటిని వాడుకునేదెప్పుడు అని ఇక్కడి రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితేనే ఇక్కడి రైతాంగానికి మేలు జరుగుతోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగెత్తాయి. పోలవరం ప్రాజెక్ట్ పనుల విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఈ మధ్యనే ఫ్యామిలీని అక్కడికి తీసుకెళ్లారు. నాలుగున్నరేళ్లు పూర్తైనా పునాది గోడలు దాటి పనులు జరగలేదు. డిజైన్లు పూర్తికాలేదు. కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్ల పేరుతో బినామీలను తెచ్చుకుని రేట్లు పెంచుకున్నారు. కమీషన్ల కోసమే పోలవరం అంచనా వ్యయం పెంచారు.
గత చంద్రబాబు పాలనలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లింది. మూతబడిన ఈ చక్కెర ఫ్యాక్టరీని ఆ దివంగత నేత వైఎస్సార్ 2004లో తిరిగి తెరిపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు.. ఆ ఫ్యాక్టరీ రూ. 43 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఇక్కడికి చక్కటి రైల్వే వ్యవస్థ ఉంది. కానీ పారిశ్రామిక అభివృద్ధి అడుగు వేయలేదు. వైఎస్సార్ హయాంలో శారదా స్టీల్స్, గోల్డ్ స్టార్ స్టీల్స్ పేరిట పలు పరిశ్రమలు ఏర్పాడ్డాయి. ఎస్ కోట, కొత్తవలస మండలాల్లోనే నాలుగు, ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. బాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఫ్యాక్టరీ రాలేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగు.. జ్యూట్ మిల్స్ మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయాయి. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది.
ముప్పై పడకల ఆసుపత్రి ఏమైంది?
కొత్తవలసలో ముప్పై పడకల ఆసుపత్రి కడతామని చంద్రబాబు గత ముప్పై ఏళ్లుగా చెబుతున్నారు. మరీ ఆ ఆసుపత్రి వచ్చిందా అని అడుగుతున్నా?(ప్రజల నుంచి లేదు లేదు సమాధానం) ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇక్కడికి వచ్చి ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ అంటాడు. ఇక్కడి ఎమ్మెల్యేకు సొంతంగా ప్రయివేట్ జూనియర్ కళాశాల ఉంది. దీంతోనే ప్రభుత్వ కాలేజీ రాకుండా ఈ ఎమ్మెల్యేనే అడ్డుపడుతున్నాడు. రైతుబజార్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచారు. మామిడి తాండ్రకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. బీమాలి, అలమండి గ్రామాల్లో తయారు చేస్తారు. మామిడి తాండ్రను నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజిలు అడిగినా కల్పించలేదు.
విశాఖ నుంచి అరకు వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా మారుస్తానని చంద్రబాబు ఊదరగొట్టారు. మీకేమైనా కనిపించిందా అని అడుగుతున్నా? ఎస్ కోట నియోజకవర్గంలో అవినీతి తప్ప ఏం కనబడటం లేదు. రియల్‌ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఎకరాకు రూ10 లక్షలు ఇవ్వాలంటా. నీరు చెట్టు అని చెప్పి తాటి చెట్టంతా తవ్వేస్తున్నారు. నీరు చెట్టు పేరిట ఇసుకను దోచేస్తున్నారు. దీని పేరుతో బిల్లులు తెచ్చుకుంటున్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. (చదవండి: వైఎస్ జగన్ చెప్పిన బల్ల కథ)
అన్నదాతలు ఆందోళనలో ఉంటే..
గుంటూరు నుంచి అనంతపురం వరకు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతలు ఆందోళనలో ఉంటే చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ఈ పెద్దమనిషి రైతుల గురించి ఉపన్యాసం చేస్తారట. అది సేంద్రీయ వ్యవసాయంపై ప్రసంగం చేస్తారట. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలను సైతం మోసం చేశారు. చంద్రబాబు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నారయణ, చైతన్య స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. చదువులకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 30 వేలు మాత్రమే ఇస్తున్నారు.
బాబు పాలనలో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. రాష్ట్రంలో లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డీఎస్సీ, టెట్, టెట్-2, టెట్-3 అంటూ మోసం చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రత్యేక హోదాను బాబు తాకట్టు పెట్టారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి అని తెలిసి కూడా తాకట్టు పెట్టారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.3200 కోట్ల రాయితీలు ఇవ్వడం లేదు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట. కానీ మంత్రి విదేశాల్లోని పంటి వైద్యానికి మాత్రం రూ.3 లక్షలు ఖర్చు చేస్తారు. మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వెయ్యాలని’ వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment