![YS Jaganmohan Reddy Comments In YSRLP meeting - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/26/STS_1337.jpg.webp?itok=qQ6G9eC7)
శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ఎల్‌పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజకీయాలను ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేద్దామని, ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు, తోడు కావాలని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. మనపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు గెలిపించారని.. ఇంత గొప్ప బాధ్యతను మన భుజస్కందాలపై మోపిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. శనివారం విజయవాడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ ఎల్పీ (శాసనసభాపక్షం) సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తతో సహా నాయకులంతా తోడుగా ఉండటం వల్లే మన పార్టీకి ఇంత గొప్ప గెలుపు సాధ్యమైందని అన్నారు. ఆరు నెలలు తిరిగే సరికి మంచి ముఖ్యమంత్రి అనిపించుకునేలా పరిపాలన సాగిస్తానని పునరుద్ఘాటించారు. శాసనసభాపక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ ఎమ్మెల్యేలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు విశ్వసనీయతకు ఓట్లేశారు
ప్రజలు వైఎస్సార్‌సీపీపై నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారని.. విశ్వసనీయత అనే పదానికి ఓట్లేశారని జగన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ఓట్ల తేడా ఒక్క శాతం మాత్రమేనని, ఆ ఒక్క శాతం తేడా మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అరాచకాలు, అన్యాయాలు చాలా చూశామని.. వీటికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామని, ఎన్నో కేసులు పెట్టించుకున్నామని జగన్ గుర్తు చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రంలో తాను 3,646 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు.
గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు ప్రతి అడుగులో, ప్రతి నిమిషంలో ఎప్పుడు, ఎక్కడ ఏ కష్టం వచ్చినా.. అక్కడ వైఎస్సార్‌సీపీ కనిపించిందన్నారు. ఏ సమస్య వచ్చినా జగన్ అక్కడకు వెళ్లి పోరాటం చేశారన్నారు. మనం చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల అభిమానాన్ని, వారి విశ్వాసాన్ని చూరగొందన్నారు. తత్ఫలితంగా ఈ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 చోట్ల స్వీప్ చేయగలగడం, 50 శాతం ఓటింగ్ వైఎస్సార్‌సీపీకి రావడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు. అందరం మరింత బాధ్యతగా పని చేసి 2024లో ఇంతకంటే గొప్ప ఫలితం వచ్చేలా కృషి చేద్దామని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని చోట్లా స్వీప్ చేసేలా పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా మన ప్రాధాన్యత
వైఎస్సార్‌ఎల్‌పీ సమావేశం అనంతరం కొత్తగా ఎన్నికైన 22 మంది లోక్‌సభ ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనే మన ప్రాధాన్యత అని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్ద గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయన వారికి సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పరాదన్నారు. రాజకీయ విధానాల్లో విశ్వసనీయత, స్థిరత్వం ఉండాలని సూచించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ జగన్ అభినందనలు తెలిపారు.
వైఎస్సార్‌ఎల్‌పీ నేతగా జగన్
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11.15 గంటలకు శాసనసభాపక్షం సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన 151 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. జగన్ సమావేశం హాలులోకి ప్రవేశించగానే ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి జయహో జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలుత పరిచయ వాక్యాలు చెబుతూ శాసనసభాపక్షం తీరును వివరించారు. పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించినందుకు ఆయన జగన్‌కు అభినందనలు తెలిపారు.
చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును శాసనసభాపక్షం నేతగా ప్రతిపాదిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మరో సీనియర్ నేత శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు దాన్ని బల పరిచారు. ఆ తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ట వీరభద్ర స్వామి, నర్సాపురం ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా జగన్‌ను బల పరిచారు. సింహం సింగిల్‌గా వచ్చి గెలిచిందంటూ రోజా వ్యాఖ్యానించడంతో కరతాళ ధ్వనులు మారుమోగాయి.
Comments
Please login to add a commentAdd a comment