ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజన్న బిడ్డను చూశామన్న ఆనందం పట్టలేని అమ్మలు.. కష్టాలు చెప్పుకొని ఊరట పొందిన అవ్వలు.. ఆత్మీయ పలకరింపుతో ఉబ్బితబ్బిబ్బయిన అక్కచెల్లెమ్మలు.. ఇలా జననేత అడుగులో అడుగులేసేందుకు మహిళాలోకం కదిలి వచ్చింది. చెట్లు, పుట్టలు.. ఇరుకుదారులు.. వీధులు.. ఇలా ఎక్కడ చూసినా అక్కచెల్లెమ్మలే కనిపించారు. దారి పొడవునా హారతులు పట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 279వ రోజు శనివారం మహిళా ప్రభంజనాన్నే సృష్టించింది.
మూలస్టేషన్ మొదలుకుని.. ఎస్‌ఎస్‌ఆర్ పేట, సోలుపు క్రాస్, మన్యపురిపేట, బెల్లంపేట, వల్లాపురం క్రాస్ వరకూ అక్కచెల్లెమ్మలు వేలాదిగా ఆయన వెన్నంటి నడిచారు. కాళ్లకు గజ్జ కట్టారు. కోలాటమాడుతూ ఆనందంతో చిందులేశారు. గుంపులుగా గుమిగూడి పాటలు పాడారు. పల్లెటూరి ఆటలాడారు. రాజన్న బిడ్డ కోసం గంటల తరబడి ఎండలో నిరీక్షించారు. చెమటలు కక్కుతున్నా కొంగులతో తుడుచుకుంటూ.. జననేతకు తమ కష్టాలు చెప్పుకొనేందుకు బారులు తీరారు. నవరత్నాల గురించి చర్చించుకుంటూ.. చంద్రబాబు మోసాలపై విరుచుకుపడ్డారు.
నా మనవడితో మాట్లాడినట్టుంది
తనకోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేశారు జగన్. వారి కష్టాలు వింటూ.. త్వరలో మనందరికీ మంచి జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం లేదయ్యా.. పేదోళ్లం ఎలా బతకాలయ్యా.. అని కన్నీళ్లు పెట్టుకున్న అవ్వలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ‘నా మనవడితో మాట్లాడినట్టుంది.. ఎంత ఓపిగ్గా నా కష్టాలు విన్నాడో బాబు.. ఎంతలా ధైర్యం చెప్పాడో’ అంటూ బెల్లంపేటకు చెందిన 70 ఏళ్ల అవ్వ కాళమ్మ తెలిపింది.
చిన్నారులను చంకనెత్తుకుని పరుగులు పెడుతూ.. ఆయాస పడుతూ వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆ చిన్నారుల్ని జగనన్న ఆత్మీయంగా పలకరిస్తున్నారని మూల స్టేషన్ వద్ద చిన్నారిని తీసుకొచ్చిన ఈశ్వరమ్మ చెప్పింది. జగనన్న పలకరింపులో ఆప్యాయత.. ఊరడింపులో ఆత్మీయత కనిపిస్తున్నాయంటూ అక్కచెల్లెమ్మలు చెమర్చిన కళ్లతో చెప్పారు. ‘అన్నా.. సెల్ఫీ.. అని కోరితే.. ‘రామ్మా’ అంటూ అన్నే సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారు.. నిజంగా ఇది మాకో స్వీట్ మెమొరీ..’ అంటూ బీటెక్ విద్యార్థిని శుశృత పట్టరాని సంతోషంతో చెప్పింది.
హోదా వచ్చి ఉంటే మీ కౌశిక్‌కు ఉద్యోగం వచ్చేదే..
తెలంగాణ రాజకీయాలపై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ముఖ్యంగా మహిళలు కేసీఆర్ మాటలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. చీపురుపల్లి దారిలో జగన్ కోసం గుమిగూడిన మహిళలు చంద్రబాబు వైఖరిపై చర్చించుకున్నారు. ‘దొంగ.. ద్రోహి.. వంచకుడు.. మోసగాడు.. అని కేసీఆర్ తిడుతుంటే ఈ చంద్రబాబుకు సిగ్గు కూడా లేదు’ అంటూ మజ్జి శారద అన్న మాటలకు ‘అవును’ అంటూ అపూర్వ, లక్ష్మి, వసంత స్పందించారు. దాదాపు పావుగంట పాటు ఈ చర్చ సాగింది.
ఓటుకు కోట్లు కేసులోనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి.. ఇక్కడా ప్రజల్ని మోసం చేస్తున్నాడు.. కేసుల నుంచి బయట పడేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు.. అంటూ చర్చించుకున్నారు. ‘హోదా వచ్చుంటే మీ కౌశిక్‌కు ఉద్యోగం వచ్చేదే’ అంటూ వసంత తన పక్కనే ఉన్న లక్ష్మితో అంది. ‘ఈసారి చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలే.. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మాయ చేసిన బాబును మన ఆడోళ్లే ఓడించాల’ అంటూ శారద చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా అవునంటూ ప్రతిస్పందించారు.
ఈ పాలనలో అధ్వాన పరిస్థితులు
పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. 16 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు స్కూల్ అసిస్టెంట్లను డెప్యుటేషన్‌పై నియమించే అధ్వాన పరిస్థితులు ఈ పాలనలో ఉన్నాయంటూ విజయనగరం డైట్ సెంటర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 13 డైట్ సెంటర్లలో 1.20 లక్షల మంది విద్యార్థులకూ కష్టాలేనన్నా.. అంటూ వాపోయారు. తమతో చాకిరీ చేయించుకుని ఉద్యోగాల్లోంచి తొలగించారన్నా అంటూ సాక్షరభారత్ వీసీవోలు జననేత ఎదుట బావురుమన్నారు. వంద శాతం వైకల్యం ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదంటూ చింతాడ అప్పారావు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం లేదని మన్యపురి పేటకు చెందిన మామిడి తౌడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. జన్మభూమి కమిటీల అవినీతికి అంతే లేకుండా పోయిందంటూ పలువురు జననేత దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో పేదలకు అన్యాయం జరుగుతోందని, ఆరోగ్యశ్రీ వర్తించలేదని, డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని.. ఇలా పలువురు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరి కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
మేం ఎలా బతకాలన్నా?
అన్నా.. సాక్షరభారత్‌లో వీసీవోగా పనిచేశాం. మమ్మల్ని ఈ చంద్రబాబు అర్థంతరంగా తొలగించారన్నా. రూ.2 వేల గౌరవ వేతనం ఉందని ఉపాధి పనికి కూడా వెళ్లనీయకుండా జాబ్‌కార్డులూ తీసేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, పింఛన్ల పంపిణీ వంటి పనులు మాతో చేయించుకున్నారు. మమ్మల్ని తొలగించినట్టు కూడా చెప్పకుండా నవనిర్మాణ దీక్షలో మాతో చాకిరీచేయించుకున్నాక చెప్పారన్నా.. అటు ఉద్యోగమూ లేక, ఉపాధి పనులకు వెళదామంటే జాబు కార్డు కూడా లేక.. మేం ఎలా బతకాలన్నా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మా తడాఖా ఏంటో చూపిస్తాం.. – జమ్ము లక్ష్మి, వీసీవో, గరుగుబిల్లి, మెరకముడిదాం మండలం
రాజన్న దయ వల్లే నా బిడ్డ చదివాడు..
పక్షవాతం వచ్చిన నాకు ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వం వైద్యం చేయడం లేదు. నెలకు రూ.10 వేలు అప్పు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రిలో మందులు వాడుతున్నా. నా కుమారుడు సీతారాం రాజన్న ఫీయిరీయింబర్స్‌మెంట్ పుణ్యమాని డీఎడ్ చదువుకున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం. కానీ అటువంటిదేం ఉండదని అర్థమైంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే మాలాంటి వారికి మేలు జరుగుతుందని నమ్ముతున్నామయ్యా.. – బంకలపిల్లి జోగులు, ఎస్‌ఎస్‌ఆర్ పేట, గుర్ల మండలం
ఆశలన్నీ మీపైనే..
నా భర్త పదిహేనేళ్ల కిందట చనిపోయాడు. నా కుమార్తెకు ముగ్గురు ఆడపిల్లలు. మాకు ఏ ఆధారమూ లేదు. పూట గడవడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక.. ఏ ఆసరా లేని మా లాంటి పేదోళ్ల కోసం ఏదన్నా చేయండయ్యా.. మీ మీదే ఆశలు పెట్టుకున్నామయ్యా..
– చందక పిచ్చి పైడితల్లి, రాయవలస, మెరకముడిదాం మండలం
Comments
Please login to add a commentAdd a comment