పట్టు కోసం ‘పట్టాల’ రాజకీయం | YSRCP Activists House Arrest In Ananthapur | Sakshi
Sakshi News home page

పట్టు కోసం ‘పట్టాల’ రాజకీయం

Published Thu, May 24 2018 10:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

YSRCP Activists House Arrest In Ananthapur - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు

రాప్తాడు నియోజకవర్గంలో తమ ప్రాభవం కోల్పోతున్నామనే భయంతో అధికారపార్టీ నాయకులు కక్షరాజకీయాలకు తెరలేపారు. తమ వారికి మేలు చేయాలనే తలంపుతో ఇతర పార్టీ నాయకులకు  ఏళ్ల క్రితం ప్రభుత్వం   ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తమ పార్టీ నాయకులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సొంత మండలం రామగిరి వేదిక అయ్యింది.

రామగిరి: రామగిరి మండలం పోలేపల్లిలో 1995లో ప్రభుత్వం దాదాపు 40 మంది రైతులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. వాటిలో కొంత మంది ఇళ్లు నిర్మించుకోగా.. మరికొంత గడ్డివాములు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పట్టాలు పొందిన వారిలో అధికారపార్టీకి చెందిన లబ్ధిదారులు దాదాపు 90 శాతం మంది ఆయా స్థలాలను ఇతరులకు విక్రయించుకున్నారు. మిగిలిన వారు అలాగే ఉంచుకున్నారు. అయితే గ్రామంలో పట్టు సాధించాలని, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కొంత కాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగకపోవడంతో ఈసారి ఏకంగా వారి ఆస్తులపై కన్నేశారు. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొడితే తమవైపు వస్తారన్న భావనతో ఏకంగా గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నారు.

నోటీసులు కూడా ఇవ్వకనే..
వాస్తవానికి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో సంబధిత లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఇటువంటి చర్యలేమీ లేకుండా మాట వినని లబ్ధిదారులను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు లొంగకపోవడంతో ఏకంగా తహసీల్దార్‌ వద్దకు తీసుకుపోయి బైండోవర్‌ చేయించారు. బుధవారం  ఉదయం ఏకంగా పోలీస్‌ భద్రతలో జేసీబీలను తీసుకువచ్చి ఆయా పట్టాలు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకుంటామంటూ గ్రామంలోకి వచ్చేశారు. దీంతో సదరు లబ్ధిదారులు వారిని ప్రతిఘటించడంతో పోలీసులు వారందరినీ అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయా స్థలాల్లో ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగింపజేశారు.

జేసీ నిర్ణయమూ బేఖాతర్‌
ఈ స్థలాల స్వాధీన విషయంలో తమ పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిలు జేసీ డిల్లీరావును కలిసి న్యాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన మాటను కూడా పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ అధికారులు అనైతికంగా పశువుల దొడ్లను, కల్లాలను ఖాళీ చేయించారు.

వ్యూహాత్మకంగా..
ఈ విషయంలో అడ్డుతగులుతారన్న ఉద్దేశంతో మంగళవారం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదిరెడ్డి, నాగిరెడ్డి, ఓబిరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఈశ్వరరెడ్డిలను బైండోవర్‌ చేశారు. తిరిగి బుధవారం హౌస్‌ అరెస్ట్‌ చేసి తమపని తాము చేసేసుకున్నారు. ఈ సంఘటన పట్ల గ్రామస్తులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంత మంత్రి పదవి ఉంటే కానీ, ఇంత దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకుంటారా.. అయినా టీడీపీ నాయకులే లబ్దిదారులా..? ఇతర పార్టీల వారు ఉండరాదా..? ఇదెక్కడి న్యాయం’ అంటూ చర్చించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement