బాధితులంతా రావాలి; మేం కూడా ‘ఛలో ఆత్మకూరు’ | YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Over Palnadu Issue | Sakshi
Sakshi News home page

బాధితులంతా రావాలి; మేం కూడా ‘ఛలో ఆత్మకూరు’

Published Tue, Sep 10 2019 1:56 PM | Last Updated on Tue, Sep 10 2019 8:52 PM

YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Over Palnadu Issue - Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గందరగోళం సృష్టించేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చాలా దారుణాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పల్నాడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అడ్డగోలు ప్రచారాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అందుకే తాము కూడా ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చామని అన్నారు. మంగళవారం జరిగిన పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడారు.

‘పచ్చ నేతల ఆగడాలను అడ్డుకోవడానికి మేం కూడా ఆత్మకూరు వెళ్తున్నాం. కోడెల బాధితులు, యరపతినేని బాధితులు, పుల్లారావు బాధితులు, ఆంజనేయులు బాధితులతో కలిసి ఆత్మకూరు వెళతాం. రేపు (బుధవారం) ఉదయం 9 గంటలకు గుంటూరు వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిస్తున్నాం. టీడీపీ శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్‌ ఆర్టిస్టులే. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగితే మా ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించడం దారుణం. గుంటూరు జిల్లాలో చాలా వరకు ఫ్యాక్షన్‌ తగ్గింది. వాస్తవాలు గ్రహించాలని ప్రజలను కోరుతున్నాం’అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు.

ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబుకు కేవలం 23 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. మా ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తే అప్పుడు ఏమైంది మీ లా అండ్‌ ఆర్డర్‌ అని ప్రశ్నిస్తున్నా. రేపు ఛలో ఆత్మకూరుకు టీడీపీ బాధితులంతా వస్తారు. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.’అన్నారు.

ఇక పల్నాడులో చాలా ప్రశాంత వాతావరణం ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు టీడీపీ బాధితులను తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను వేధించారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గుర్తు చేశారు. తమకు ఎలాంటి గొడవలు లేవని చంద్రబాబే కావాలనే గొడవలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు చల్లగా ఉంటే చంద్రబాబుకు కడుపు మంట అని చురకలంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement