
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలేవి రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎన్‌ఐఏని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుంటుండగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన మీద పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్టేల సీఎంగా బాబు పేరు మారుమోగి పోతుందంటూ ఎద్దేవా చేశారు.
బాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. టీడీపీ మంత్రులు, నాయకుల అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు వస్తే సహకరించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న లక్షల కోట్ల అవినీతి సొమ్మును దాచుకునేందుకు బాబు కూడా విజయ్ మాల్యాలా దేశం విడిచి పారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
అడ్రస్ లేని గంటా ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిలో గంటాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలన్నారు. సహచర మంత్రి అయ్యన్న ఆరోపణలకు గంటా ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కాక దోచుకున్న ఆస్తులు దాచుకోవడానికి సీఎం పర్యటనలు చేస్తున్నారని అమర్‌నాథ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment