
సాక్షి, విజయనగరం : కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడటం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే స్పందించడం వల్ల శ్రీవాణి దంపతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పాలనకు స్వస్థి పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ఆయన కుమారుడు వైఎస్ జగన్ అందిస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరిపించిన జిల్లా అధికారులకు వైస్సార్ సీపీ తరఫున శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కురుపాం విషయంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.