
విలేకరుల సమావేశంలో ఎంవీఎస్ నాగిరెడ్డి
రైతులు ఆందోళనలో ఉన్నపుడు ఆదుకోవాల్సింది పోయి ఎగతాళిగా మాట్లాడతారా?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకృతి విధ్వంసం జరిగినపుడు ఒక ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి హుందాగా ప్రవర్తించాలని ఏపీ సీఎం చంద్రబాబు నుద్దేశించి అన్నారు. అలా కాకుండా కరువును జయించాను, రుతుపవనాలను ఒడిసిపట్టుకున్నాను, సముద్రాలను కంట్రోల్ చేశాను, తుపానులను ఆపే టెక్నాలజీ నా దగ్గర ఉంది అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో మానవాతీత శక్తిలాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 124 ఏళ్లలో వచ్చిన తుపానుల్లో నాలుగో అతి భయంకరమైన తుపానుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెబుతుంటే తుపాను వచ్చే సమయానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ సీఎంల ప్రమాణస్వీకారోత్సవానికి వెళతారా అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఏమైనా ఫర్వాలేదు కానీ తన ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు బాబు వ్యహారం ఉందని ధ్వజమెత్తారు.
‘ఇరిగేషన్ శాఖ మంత్రి 59,900 హెక్టార్లలో పంట దెబ్బతిన్నది చెబితే.. సీఎం 14 వేల హెక్టార్లలో పంట దెబ్బతిందని చెప్పారు. రియల్ టైం గవర్నర్స్ ద్వారా 10వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మళ్లీ చెప్పారు. ఇలా ఎవరిపడితే వారు అర్ధం పర్ధం లేకుండా పంటనష్టం వివరాలు చెబుతున్నారు. 2 వేల మంది యంత్రాంగం తుపానును ఎదుర్కోవడానికి ఫీల్డ్‌లో సిద్ధంగా ఉన్నారని సీఎం ట్విట్టర్‌లో పోస్టు చేస్తే.. అరగంట తర్వాత లోకేష్ బాబు తన ట్విటర్‌లో 10 వేల మంది యంత్రాంగం సిద్ధంగా ఉన్నారని ట్వీట్ చేశారు. ఏది నిజం ఏది అబద్ధం. ప్రజలతో టీడీపీ నాయకులు ఆడుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల తీరు ప్రజలను మాయ చేసేలా ఉంద’ని నాగిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
‘కృష్ణా,గుంటూరు జిల్లాల్లో వరిపంట మొత్తం దెబ్బతిన్నది. రెండో పంటగా వేసిన మిర్చి, మినుము పంటలు కూడా దెబ్బతిన్నాయి. అరటి పంట పూర్తిగా దెబ్బతింది. రైతుల బకాయిలు చెల్లించకుండా రుణమాఫీ చేశానని అబద్దాలు చెబుతున్నారు. తిత్లీ తుపానులో డమ్మీ చెక్కులు ఇచ్చి రైతులను మభ్యపుచ్చారు. కృష్ణా డెల్టాలో పంటలు పూర్తిగా నష్టపోయాయి. చంద్రబాబుకు వ్యవసాయంలో ఓనమాలు తెలియవు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మాటలకు చంద్రబాబు మాటలకు పొంతనే లేదు. తుపానుపై ప్రెస్ మీట్ లో చంద్రబాబు 15 నుంచి 20 శాతం కూడా తుపాను నష్టం గురించి మాట్లాడకుండా రాజకీయాలపై మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈరోజుకు కూడా రైతులందరూ గుర్తుంచుకున్నారు.. దానికి కారణం వైఎస్‌ఆర్ రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం వల్లే వాళ్ల గుండెల్లో ఉన్నారు. రైతులు ఆందోళనలో ఉన్నపుడు ఆదుకోవాల్సింది పోయి ఎగతాళిగా మాట్లాడతారా? ఇప్పటికైనా మీరు, మీ మంత్రులు వాస్తవ విషయాలు వెల్లడి చేసి రైతాంగానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల’ని నాగిరెడ్డి కోరారు.