సాక్షి, గుంటూరు : ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అమానుషం అని వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు అరెస్టులకు భయపడేది లేదన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, ముస్తఫాలతో కలిసి జైల్లో 9మంది ముస్లిం యువకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పరిపాలన సంకెళ్లమయమని విమర్శించారు. ముస్లీంలపై చంద్రబాబుకు వ్యతిరేకత ఉందనని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పాతరేసేలా చంద్రబాబు పాలన ఉందని దుయ్యబట్టారు. ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ నుంచి మైనార్టీలను విడదీయలేరని వ్యాఖ్యానించారు.
పథకం ప్రకారమే సభలో అల్లరి సృష్టించారు: డీఎస్పీ
సీఎం సభలో నంద్యాలకు చెందిన కొందరు యువకులు పథకం ప్రకారమే అల్లరి సృష్టించారని, కుట్రపూరితంగా ప్లకార్డులు ప్రదర్శించి గొడవ చేశారని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు చెప్పారు. సీఎం సభలో గందరగోళం సృష్టించాలని 9 మంది యువకులు వారం ముందుగానే నిర్ణయించుకున్నారని తెలిపారు. వారు ఈ నెల 27వ తేదీ రాత్రి నంద్యాల నుంచి రైలులో బయల్దేరి 28వ తేదీ ఉదయం గుంటూరు చేరుకున్నారని వెల్లడించారు. రహస్య ప్రాంతాల్లో తలదాచుకుని మీటింగ్ సమయానికి వచ్చి అల్లర్లు సృష్టించారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై సీఆర్‌పీసీ 505క్లాజ్2,1బి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment