టీడీపీదే దాడుల రాజ్యం! | YSRCP Leaders Fires On TDP Govt | Sakshi
Sakshi News home page

టీడీపీదే దాడుల రాజ్యం!

Published Wed, Sep 11 2019 5:03 AM | Last Updated on Wed, Sep 11 2019 7:57 AM

YSRCP Leaders Fires On TDP Govt - Sakshi

గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు

టీడీపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందునే దృష్టి మళ్లించేందుకు పునరావాస కేంద్రాలంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. తెలుగుదేశం పార్టీ పాత పద్ధతిలో హత్యా రాజకీయాలు కొనసాగించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
– వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో టీడీపీ హయాంలోనే విచ్చలవిడిగా దాడులు, రాజకీయ హత్యలు, కక్షసాధింపులు జరిగాయని మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రభుత్వాధికా రులపై చేయి చేసుకున్న ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని ఆయన చెప్పారు. గుంటూరులో మంగళవారం ఆ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నేత చంద్రబాబు అభద్రతా భావంతో తన ఉనికిని చాటుకోవడానికి చిల్లర రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. నిజానికి టీడీపీ పాలనలో పల్నాడు ప్రాంతం నుంచి ఎందరో గుంటూరుకు వచ్చి బిక్కుబిక్కుమంటూ గడిపారని మోపిదేవి గుర్తుచేశారు.

కోడెల కుటుంబం అరాచకాలకు బలైన బాధితులు కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తే తమను నిందించడం సరికాదన్నారు. అలాగే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌పై కోర్టు ప్రశ్నిస్తే బాధ్యత ప్రభుత్వానిది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందునే వాటిని దారిమళ్లించేందుకు పునరావాస కేంద్రాలంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మోపిదేవి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పాత పద్ధతిలో కొనసాగాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్ధవంతమైన పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇంతకుముందు వరద రాజకీయాలకు తెరలేపారని.. అవి బెడిసికొట్టడంతో ఇప్పుడు హత్యా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.  

టీడీపీ బాధితులతో ఆత్మకూరుకు : అంబటి
కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో తమ మంత్రులు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై ‘చలో ఆత్మకూరు’ విషయమై చర్చించామన్నారు. తాము కూడా టీడీపీ బాధితులతో కలిసి గుంటూరు పార్టీ కార్యాలయం నుంచి ఉ.9 గంటలకు బయల్దేరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే రాష్ట్రంలో బాబు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చాలా దారుణాలు జరిగాయన్నారు. పల్నాడులో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారంటూ బాబు గగ్గోలు పెడుతున్నారని.. తన పబ్బం గడుపుకోవడానికి ఆయన నీచంగా ప్రవర్తిస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రాంతంలో యరపతినేని, కోడెల కక్షపూరిత వాతావరణం సృష్టించి ఫ్యాక్షనిజాన్ని పెంచిపోషించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, పుల్లారావు, ఆంజనేయులు కూడా దారుణంగా వ్యవహరించారని తెలిపారు. టీడీపీ పాలనలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని, వారందరినీ మీ వద్దకు తీసుకొస్తామని, వారికి మీరు సమాధానం చెప్పాలని చంద్రబాబును అంబటి కోరారు. కోడెల బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక బాధితులు లేరని, చిన్నచిన్న సంఘటనలు ఉంటే సరిచేస్తున్నామని వివరించారు. కాగా, ఆత్మకూరుకు కోడెల, యరపతినేని, ఆంజనేయులు బాధితులతో కలిసి వెళ్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసుల అనుమతులు కూడా తీసుకుంటామన్నారు. 

పల్నాడులో చిచ్చు పెట్టొద్దు
నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబునాయుడు దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేశారన్నారు. పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి కోరుకుంటున్నారని.. అక్కడ చిచ్చు పెట్టొద్దని చంద్రబాబును కోరారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు సభకు కోడెల, యరపతినేనితోపాటు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పల్నాడు మాజీ ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలపై  బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్‌ విసిరారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో రౌడీషీటర్లు తప్ప, పల్నాడు ప్రాంత ప్రజలు ఎవరూ లేరన్నారు. సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగిరి ఏసురత్నం, కావటి మనోహర్‌నాయుడు, టీడీపీ బాధితుడు గొడుగుల సుబ్బారావు, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement