
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలో వాళ్లు మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు అంత అవినీతిపరుడైన సీఎం మరొకరు లేరని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు.
వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం నేపథ్యంలో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. అదే రోజు ఏపీ భవన్ వద్ద ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదాపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి.. దీక్షలో పాల్గొనేలా చేయాలని సవాలు విసిరారు.
ఇక కేసుల భయంతోనే బాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. ఇప్పటికైనా బాబు రెండు నాల్కల ధోరణిని మానుకోవాలని సూచించారు. ఈ నెల 6న వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భూమన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment