గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్‌బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు.
వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి
డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు.
వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి
రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment