
మీడియాతో మాట్లాడుతున్న అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేస్తాననటం హాస్యాస్పదమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వతే రాయలసీమలో పర్యటించాలని సవాల్ విసిరారు. శనివారం అనంతవెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకూడదు. అధికార వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెట్టలేదు. టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఏపీ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. రాయలసీమ పర్యటనకు వస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలి. స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు అనంతపురంలో పర్యటించాలి. అమరావతిలో పోరాటం చేస్తున్నది రైతులు కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా?.. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలా? వద్దా?.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలా? వద్దా?..
అమరావతి కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారా?..మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు అక్కర్లేదా?.. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు చంద్రబాబు భిక్షాటన ఎందుకు చేయలేదు?.. సీమ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?.. శ్రీభాగ్ ఒప్పందం అమలుపై చంద్రబాబు వైఖరి ఏంటి?.. టీడీపీ అమరావతికే పరిమితమా?.. చంద్రబాబు అమరావతికి మాత్రమే నాయకుడా?.. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు.