సాక్షి, హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ డేటా చోరి వ్యవహారంతో ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. తక్షణమే ఏటీఎం, క్రెడిట్ కార్డుల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన వ్యక్తే కన్నబిడ్డల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టాడని, అకౌంట్లలో డబ్బులూటీ అయ్యే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. బుధవారం ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ బాబులు సైబర్ సాబోటేజ్‌కు పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. దొంగే దొంగని అరవటం, ఎదురు దాడులు చేయించడం, కుల మీడియా ద్వారా అబద్దపు కథనాలు వడ్డించడం .. ఎన్ని చేసినా తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరని హెచ్చరించారు. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి కొట్టుకపోయినట్లు నక్కజిత్తుల కుట్రలకు తెరపడినట్టేనన్నారు. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుందామన్నారు.
నాలుగేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పుటి సీనే రిపీట్ అవుతుందని తెలిపారు. ఎదురు దాడి, పొంతన లేని విమర్శలు, వణుకుడు సేమ్ టు సేమ్ అప్పట్లాగే ప్రవర్తిస్తున్నారని, మంత్రులు, డీజీపీ, అడ్వొకేట్ జనరల్‌తో సంతాప సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఏం లేక పోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబూ?.. అని ప్రశ్నించారు. చంద్రబాబు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా.. బ్రిటీష్ పాలకుల విభజించు పాలించు సూత్రాన్ని బాగా అలవర్చుకున్నారని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలను కూడా విభజించారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment