
రాజ్యసభ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఢిల్లీ : విశాఖపట్నం జిల్లా షీలానగర్‌లో 500 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 8.59 ఎకరాల భూమి అనువుగా లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బుధవారం రాజ్య సభలో వెల్లడించారు. షీలానగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? అలాంటి పరిస్థితులలో ఉత్తరాంధ్రలోని లక్ష మందికి పైబడి ఉన్న కార్మికులు శిధిలమైన భవనంలో ఉన్న ప్రస్తుత ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇంకా ఎంత కాలం వైద్య సేవలను పొందాల్సి ఉంటుంది? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్మిక మంత్రి సవివరంగా జవాబిచ్చారు.
విశాఖపట్నంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ఈఎస్‌ఐకి షీలానగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 8.59 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అయితే ఈ భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువు కాదని తేలింది. దీనికి ప్రత్యామ్నయంగా విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి చెందిన ప్రాంతంలో 10 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ఈఎస్‌ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి తగిన భూమిని ఇంకా కేటాయించాల్సి ఉంది. అంతే తప్ప ఈఎస్‌ఐ ఆస్పత్రి భవన నిర్మాణ ప్రాజెక్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) ఆవరణలోని భవనం శిధిలావస్థకు చేరిన దృష్ట్యా దీనిని ఆస్పత్రి సేవలను అద్దెకు తీసుకున్న భవనంలోకి మార్చినట్లు ఆయన తెలిపారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ కార్గో టెర్మినల్ కార్యకలాపాలు నవంబర్ 2017 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లు పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం రాజ్య సభలో ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్, అలైడ్ సర్వీసెస్ కంపెనీ ఆధ్వర్యంలో కార్గో టెర్మినల్ కార్యకలాపాల నిర్వహణ జరుగుతున్నట్లు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు.అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్‌కు అవసరమైన ట్రక్-డాక్ ఏరియా, కార్గో స్టోరేజ్ స్థలం, కోల్డ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్స్, ఎక్స్-రే స్క్రీనింగ్ మెషీన్, ఎక్స్‌ప్లోజివ్ డిటెక్టర్ మెషీన్ వంటి అన్ని వ్యవస్థల ఏర్పాటు జరిగినట్లు మంత్రి తెలిపారు.
అన్ని రకాల కార్గో, బల్క్ కార్గో కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన రీతిలో కార్గో టెర్మినల్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఏటా 20,00 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతి, దిగుమతి సామర్ధ్యం కలిగి ఉన్న ఈ టెర్మినల్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 మెట్రిక్ టన్నుల కార్గో ఎగుమతులు, 155 మెట్రిక్ టన్నుల కార్గో దిగుమతి జరిగింది. పెరిగే అవసరాలకు అనుగుణంగా టెర్మినల్ సామర్ధ్యాన్ని పెంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు.