కందుకూరులోని బాలికల వసతి గృహంలో విద్యాబోధన చేస్తున్న ట్యూటర్
కందుకూరు రూరల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని వసతులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే.. ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్లను నియమించి ఉదయం, సాయంత్రం వేళ తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పగా చెబుతున్న పాలకులు.. ఆ ట్యూటర్లకు సక్రమంగా వేతనం ఇవ్వాలన్న విషయాన్ని గాలికొదిలేశారు.
సాంఘిక సంక్షేమశాఖ బాలుర, బాలికల వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 67 వసతి గృహాల్లో ఉండగా.. వీరి కోసం 268 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం వేళల్లో వసతి గృహాలకు వెళ్లి విద్యాబోధన చేస్తుంటారు. దీంతోపాటు స్టడీ అవర్లు కూడా నిర్వహిస్తారు. ఇందుకుగాను వీరికి నెలకు రూ.1,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. గత 24 నెలలుగా 268 మందికి జీతాలు మంజూరు చేయలేదు. సుమారు రూ.96.48 లక్షల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా సాంఘిక సంక్షేమశాఖాధికారులు కేవలం రూ.22 లక్షలేనని చెబుతుండటం గమనార్హం. నెలల తరబడి ట్యూటర్లు వేతనం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అదిగో.. ఇదిగో.. అంటూ ఆశ చూపుతూ కాలం గడిపేస్తున్నారు.
♦ రెండేళ్లుగా వేతనం రాకపోవడంతో జిల్లాలో కొందరు ట్యూటర్లు మానేస్తున్నారు. కందుకూరు ఎస్సీ బాలుర వసతి గృహం–2లో ట్యూటర్లకు జీతం ఇవ్వకపోవడం వల్ల మానేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని హాస్టళ్లలో ట్యూటర్లు కూడా వసతి గృహాలకు వెళ్లడం మానేస్తుండగా.. ఇంకొందరు మాత్రం జీతం రాలేదన్న ఆవేదనతో తరగతులు చెప్పడం లేదు. పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ట్యూటర్లు సక్రమంగా వసతి గృహాలకు రాక.. స్టడీ అవర్లు నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గితే చర్యలు తప్పవని వార్డెన్లను హెచ్చరిస్తుండటంతో వార్డెన్లకు భయం పట్టుకుంది. ట్యూట ర్లకు నచ్చజెప్పి పిలిచినా.. జీతం లేకుండా ఏం పని చేస్తామని ప్రశ్నిస్తున్నారని వార్డెన్లు చెబుతున్నారు.
♦ ‘‘అసలే నిరుద్యోగులం.. చాలీచాలని వేతనం అయినా ఉదయం, సాయంత్రం వచ్చి విద్యాబోధన చేస్తున్నాం. అయినా సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకపోతే ఎలా పని చేయాలి. ఇల్లు గడవాలి కదా’’ అని ట్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ట్యూటర్లకు సకాలంలో జీతం ఇచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
24 నెలలుగా జీతం ఇవ్వలేదు
కందుకూరు బాలికల వసతి గృహం–1లో హిందీ ట్యూటర్‌గా పని చేస్తున్నా. 24 నెలలుగా జీతం అందలేదు. నాలుగు చోట్ల ట్యూషన్లు చెప్పుకుని జీవనం సాగిస్తున్నాం. రెండు సంవత్సరాలుగా జీతం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా వేతన బకాయిలు అందించాలని కోరుతున్నాం. – ఎస్‌డీ రఫీ, హిందీ ట్యూటర్
పేద విద్యార్థులపై ప్రభుత్వ చిన్నచూపు
వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పదో తరగతి ట్యూటర్లకు 24 నెలలుగా వేతన బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం. దీని కారణంగా కొన్ని వసతి గృహాల్లో ట్యూటర్లు మానేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ట్యూటర్లు లేకపోతే విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. ప్రభుత్వం స్పందించి జీతం వెంటనే విడుదల చేయాలి.
– ఎస్.ఓబుల్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment