సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్‌కే కాదు.. ఈనాడు రాష్ట్రంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాకూ వెన్నుపోటు పొడిచారు.. సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు.. ఆనాడు మీడియా చంద్రబాబు చేతిలో ఉంది.. అందుకే పూర్తి నిజాలు ప్రజలకు చెప్పలేదు.. అయినా ఇప్పుడు సినిమా పొరుగు రాష్ట్రాల్లో విడుదలైంది.. నిజాలు తెలుసుకోకుండా అడ్డుకోలేరు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తాజా కబురు.
ఎన్టీరామారావుకు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి నుంచి తొలగించి ఆయన అధికారం చేజిక్కించుకోవడం ఇతివృత్తంగా రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. కుట్రతో మరుగు పరిచిన నిజాలను ప్రజలకు చెప్పేందుకు ఈ సినిమా నిర్మించడంతో చంద్రబాబు హడలిపోయారు. ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో శుక్రవారం తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాల్లో సినిమా విడుదలైంది. అభిమానులు సరిహద్దు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు పరుగులు తీశారు. అనంతరం సినిమా గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేశారు. ప్రధానంగా కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి.
కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో తాను తోడు కోసం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ చెప్పినప్పుడు చంద్రబాబు అండ్ బ్యాచ్ వ్యతిరేకించడం.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలకు వ్యతిరేకంగా ఆనాడు పత్రికల్లో దుష్ప్రచారం చేసేలా ఓ పత్రికాధిపతితో చంద్రబాబు కుట్ర పన్నడం.. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించి వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై చెప్పులు వేయించడం.. చివరికి ఎన్టీఆర్ చనిపోయాక ఆయన మృతదేహం వద్దకు లక్ష్మీ పార్వతి రాకుండా చంద్రబాబు, బాలకృష్ణ తదితరలు అడ్డుకోవడం.. ఇలా ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు, పాత్రధారుల గురించి సినిమా చూసిన వారు ఇతర మిత్రులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారన్నది యువతరానికి బోధపడింది. ‘టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబును ఓ పరిపాలనా దక్షుడిగా చూపిస్తూ వచ్చింది.. కానీ ఆయన అసలు స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది’ అని ఓ యువకుడు వ్యాఖ్యానించారు. ‘ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోవడంలో టీడీపీ మీడియా చంద్రబాబుకు ఎంతగా సహకరించిందో తమకు అర్థమైంది’ అని ఓ యువతి వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు గురించి టీడీపీ అనుకూల మీడియా అంతగా ఎందుకు అబద్ధాలు చెబుతోందన్నది కూడా తెలిసింది’అని ఆమె చెప్పడం గమనార్హం. ఈసారి తాము మోసపోమని, చంద్రబాబును ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంతటి మోసగాడో ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ నేటి తరానికి తెలియజేశారని ఓ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు.
‘సినిమాలో కామెడీ సీన్లు లేవని ఎవరూ అనుకోవద్దు.. బాలకృష్ణ పాత్రధారి చెప్పిన డైలాగులతో కామెడీ బాగా పండింది’ అని ఓ ప్రేక్షకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఏపీలో సినిమా రిలీజ్ కాలేదని బాధపడొద్దు ఆంధ్రా బ్రదర్స్.. తెలంగాణాకు రండి.. ఈ సినిమా చూసి చంద్రబాబు నైజం ఏమిటో తెలుసుకోండి..’అని హైదరాబాద్‌వాసి ఒకరు ఆహ్వానం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment