
నయనతార
తమిళసినిమా: డబ్బు, పేరు, పరపతి ఇలా ఎన్ని ఉన్నా మనిషికి కావలసింది అంతకు మించి ఒకటుంటుంది. అదే మనశ్శాంతి. దాన్ని ఒక్కొక్కరు ఒక్కో చోట పొందుతుంటారు. నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మక చింతనతో హిమాలయాల బాట పడుతుంటారు. మరి కొందరు భక్తిభావంతో ఆలయాలను సందర్శిస్తారు. ఇటీవల నయనతారలో కూడా భక్తి భావం పెరిగింది. తరచూ గుళ్లు, గోపురాలు చుట్టోస్తున్నారు. ప్రేమ కోసం ఒకసారి మతం మార్చుకోవడానికి సిద్ధపడిన ఈ కేరళా భామ ఆ ప్రేమ ఫలించకపోవడంతో మళ్లీ యథావిధిగా అసలు మతాన్నే పాటిస్తున్నారు.
ఇటీవల పంజాబ్ రాష్టం, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను నయన్ సందర్శించడం చర్చకు దారి తీస్తోంది. అగ్రనటిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ నటిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నయన్ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సారైనా తన ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని కోరుకుని దైవదర్శనం చేసుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది. నయనతార నల్లని సల్వర్ ధరించి, నెత్తిపై అదే రంగు షాల్‌ను వేసుకుని చిరుదరహాసంతో గోల్డెన్ టెంపుల్ వద్ద దిగిన ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.