
తమిళసినిమా: చిన్న బ్రేక్ తీసుకుంటున్నా అంటోంది నటి నివేదాథామస్. ఈ మలయాళ కుట్టి బాల తారగానే సినీరంగప్రవేశం చేసింది. అదేవిధంగా మాతృభాష మలయాళంతో పాటు, తమిళం, తెలుగులోనూ వరుసగా నటించేస్తోంది. తమిళంలో కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ మధ్య పాపనాశం చిత్రంలో కమలహాసన్ కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే తెలుగులో మాత్రం హిట్ చిత్రాల నాయకిగా ఎదుగుతోంది. నానీకి జంటగా జెంటిల్‌మెన్ చిత్రంతో టాలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన నివేదాథామస్, నిన్నుకోరి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం జూలియట్ అవర్ ఆఫ్ ఇడియట్ చిత్రంలో నటిస్తోంది. మరిన్ని అవకాశాలు అమ్మడి తలుపులు తడుతున్నా నో చెబుతోందట.
కారణం తనకు చిన్న గ్యాప్ కావాలి అంటోందట. ఎవరైనా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలో వచ్చే అవకాశాలను వద్దంటారా? తాను అంటానంటోంది నివేదాథామస్. కారణం ఏమంటంటే ఈ మలయాళీ కుట్టి మనసు చదువు మీదకు మళ్లిందట. ఆర్కిటిక్ విద్యలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తానని అంత వరకూ తాను నటనలో చిన్న గ్యాప్ తీసుకుంటున్నానని నివేదాథామస్ అంటోంది. అంతా బాగానే ఉంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత ఈ అమ్మడికి తెలియదేమో. ఇంతకు ముందు లక్ష్మీమీనన్ కూడా నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె పరిస్థితి ఏలా మారిందో తెలుసు కథా! అవకాశాల కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా నివేదాథామస్ జాగ్రత్త పడితే ఆమెకే మంచిదంటున్నారు సినీ విజ్ఞులు. చూద్దాం నటిగా ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో.
Comments
Please login to add a commentAdd a comment