తొలి వన్డే న్యూజిలాండ్‌దే
టామ్ లాథమ్ సెంచరీ
బంగ్లాదేశ్‌పై 77 పరుగులతో విజయం
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ టామ్ లాథమ్ (137; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడంతో... బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 77 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సాధించింది. గురువారం నెల్సన్‌లో రెండో వన్డే జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 341 పరుగులు చేసింది.
బంగ్లాతో ఆడిన 26 వన్డేల్లో కివీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. కొలిన్ మున్రో (61 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి లాథమ్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 158 పరుగులు జోడించాడు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన బంగ్లా 44.5 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షకీబ్ (59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హుస్సేన్ (50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫెర్గూసన్, నీషమ్‌లకు మూడేసి వికెట్లు, సౌతీకి రెండు వికెట్లు దక్కాయి. లాథమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.