హిట్.. హిట్.. ముర్రే
మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ సొంతం
⇒ ‘క్లే కింగ్’ నాదల్‌పై ఘనవిజయం
⇒ రెండు వారాల్లో రెండో టైటిల్
మాడ్రిడ్: క్లే కోర్టులపై తొలి టైటిల్ సాధించేందుకు పదేళ్లపాటు నిరీక్షించిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఊహించనివిధంగా వారం తిరిగేలోపు రెండో టైటిల్ సాధించి ఆశ్చర్యపరిచాడు. ‘క్లే కోర్టు’లపై తిరుగులేని రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి నెగ్గడం ఇక్కడ విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-2తో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై నెగ్గి విజేతగా నిలిచాడు.
గతవారం మ్యూనిచ్ ఓపెన్‌లోనూ ముర్రే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్‌లో తొలిసారి క్లే కోర్టులపై టైటిల్ సాధించాడు. ఏప్రిల్ 11న తన చిన్ననాటి స్నేహితురాలు కిమ్ సియర్స్‌ను వివాహం చేసుకున్నాక ముర్రే ఆడిన రెండు టోర్నీల్లోనూ టైటిల్స్ నెగ్గ డం విశేషం. విజేతగా నిలిచిన ముర్రేకు 7,99,450 యూరోల (రూ. 5 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
పదేళ్ల తర్వాత ‘ఐదు’ బయటకు నాదల్
మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయిన రాఫెల్ నాదల్ ర్యాంకింగ్స్‌లోనూ పడిపోయాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్పెయిన్ స్టార్ నాలుగు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. 2005 తర్వాత నాదల్ టాప్-5 ర్యాంకుల్లో లేకపోవడం ఇదే తొలిసారి. జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆండీ ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.