
న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లాంటి పెద్ద టోర్నీల్లో విశేష అర్హతలున్న ఆటగాళ్లు కీలకం అవుతారని... యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ సరిగ్గా అలాంటివాడేనని అంటున్నాడు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. అందుకని పంత్‌ను తప్పనిసరిగా ప్రపంచ కప్ జట్టులోకి ఎంపిక చేయాలని సూచిస్తున్నాడు. ‘సాధారణంగా జట్టుకు ఒక్కొక్కరు శక్తిమేర ఉపయోగ పడుతుంటారు. రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ మంచి ఆటగాళ్లే. కాకపోతే ఒకే తీరుగా ఆడుతుంటారు. ప్రపంచ కప్‌నకు వచ్చేసరికి పంత్‌లాంటి ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఆటగాళ్లు కావాలి.
బ్యాటింగ్‌లో కుడి–ఎడమ కాంబినేషన్ ముఖ్యం. టీమిండియాలో చూస్తే ధావన్ తప్ప ఏడో స్థానం వరకు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ లేరు. పంత్ మ్యాచ్ విన్నర్. రోహిత్‌శర్మలా అలవోకగా సిక్స్‌లు బాదుతాడు. బ్యాకప్ ఓపెనర్‌గానూ పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లి... అతడిని ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు. రోహిత్, కోహ్లి, బుమ్రా తర్వాత జట్టులో నాలుగో ‘మ్యాచ్ విన్నర్’ పంత్’ అని నెహ్రా విశ్లేషించాడు.