చాన్నాళ్ల తర్వాత వన్డే సమరం... అందులోనూ తటస్థ వేదికపై! రెండు చిన్న జట్లు సహా బహుళ దేశాల ప్రాతినిధ్యం... ఉత్కంఠను పెంచే చిరకాల ప్రత్యర్థుల పోరు! నేటి నుంచే ఆసియా కప్! భారత్‌కు ఎంతగానో అచ్చొచ్చిన టోర్నీ! ...మరి ఎప్పటిలాగే టీమిండియా సత్తా చాటుతుందా? విజేతగా తిరిగొస్తుందా?
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్ వన్డే టోర్నీ దుబాయ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. 14వ సారి (గతంలో 12 సార్లు వన్డే, ఒకసారి టి20) నిర్వహిస్తున్న ఈ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఆరు సార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తొలి మ్యాచ్‌ను అబుదాబిలో ఈ నెల 18న క్వాలిఫయర్ హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజే దాయాది పాకిస్తాన్‌తో కీలక సమరంలో రోహిత్ శర్మ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఎంతకాలంగానో అస్థిరంగా ఉన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునేందుకు, ప్రపంచ కప్ కూర్పుపై అంచనాకు వచ్చేందుకు మన జట్టుకు ఈ టోర్నీ ఓ అవకాశంగా నిలవనుంది. తద్వారా మాజీ కెప్టెన్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ స్పష్టమవుతుంది.
రెండు గ్రూపులుగా...
టోర్నీలో జట్లను పూల్ ‘ఎ’ (భారత్, పాకిస్తాన్, హాంకాంగ్), పూల్ ‘బి’ (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)గా వర్గీకరించారు. తమ గ్రూపుల్లో 1, 2 స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ ఫోర్ దశలో ఆడాల్సి ఉంటుంది. దీని ప్రకారం భారత్, పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎదురుపడే అవకాశం ఉంది. సంచలనాలేమీ లేకుంటే ఫైనల్లోనూ ఈ రెండు జట్లే అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగొచ్చు.
బంగ్లాను లంక ఆపగలదా?
బంగ్లాదేశ్... కొంతకాలంగా వన్డేలు, టి20ల్లో రాణిస్తూ స్థాయిని పెంచుకుంటోంది. ఇదే సమయంలో శ్రీలంక ఆటతీరు దిగజారింది. ఇటీవలి నిదహాస్ ట్రోఫీలో సొంతగడ్డపైనే లంకకు బంగ్లా షాకిచ్చింది. బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, లిటన్ దాస్, బౌలింగ్‌లో కెప్టెన్ మష్రఫె మొర్తజా, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్‌లతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. కీలక ఆల్‌రౌండర్ షకీబ్ హసన్‌కు తోడు, మెహదీ హసన్‌లతో స్పిన్ విభాగమూ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ మాథ్యూస్ సేనకు సవాలు తప్పదు. మరోవైపు లంక చండిమాల్ లేకుండానే బరిలో దిగుతోంది. పేసర్ లసిత్ మలింగ పునరాగమనం ఆశలు రేపుతోంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, సీనియర్ ఓపెనర్ తరంగ, డిక్‌వెలా, కుశాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మూలస్తంభాలు. కుశాల్, తిసారా పెరీరా ద్వయం రాణిస్తే గెలుపుపై భరోసా పెట్టుకోవచ్చు. అయితే, కొంత పేస్‌కు సహకరించే దుబాయ్ పిచ్‌లపై బంగ్లా పేస్ త్రయాన్ని ఎదుర్కొనడం క్లిష్టమే.
షెడ్యూల్ మార్చకుండానే...
భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో టోర్నీ షెడ్యూల్‌పై గత నెలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హాంకాంగ్‌తో వన్డే ఆడి... విశ్రాంతి లేకుండా, మరుసటి రోజే పాకిస్తాన్ వంటి ప్రత్యర్థితో తలపడటం సరికాదని వ్యాఖ్యలు వచ్చాయి. అయినా, షెడ్యూల్‌లో మార్పులేమీ లేకుండానే టోర్నీ ప్రారంభమవుతోంది.
ఆసియా కప్ టోర్నీలో 12 సార్లు పోటీపడ్డ టీమిండియా ఆరుసార్లు విజేతగా నిలిచింది. శ్రీలంక ఐదు సార్లు, పాక్ రెండు సార్లు గెలుచుకున్నాయి.
‘ఆసియా’ సమరం
Published Sat, Sep 15 2018 4:47 AM | Last Updated on Sat, Sep 15 2018 10:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment