అదరగొట్టిన హాకీ జట్టు
కుంటాన్ (మలేసియా): భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అద్భుతమైన గోల్‌కీపింగ్‌తో రాణించడంతో సెమీఫైనల్లో భారత్.. దక్షిణ కొరియాపై పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరుజట్ల స్కోర్లు 2–2తో సమమవడంతో షూటౌట్ నిర్వహించారు. షూటౌట్‌లో భారత్ 5–4తో గెలిచింది. మ్యాచ్ 15వ నిమిషంలో తల్విందర్ సింగ్ గోల్‌తో భారత్‌కు చక్కటి ఆరంభం లభించగా.. 21 నిమిషంలో గోల్ చేసిన సియో ఇన్ వూ స్కోర్లను సమం చేశాడు. 53వ నిమిషంలో యాంగ్ జి హున్(కొరియా).. 55వ నిమిషంలో రమన్ దీప్ సింగ్ (భారత్) గోల్స్ చేయడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత చివరి 5 నిమిషాల్లో భారత్ దూకుడుగా ఆడి పదేపదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా.. సఫలం కాలేకపోయింది. దాంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
షూటౌట్‌లో భారత్ తరఫున సర్దార్ సింగ్, రమన్ దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ విజవంతంగా గోల్స్ చేయగా.. ఐదోషాట్ ఆడిన బీరేంద్ర లక్రాను కొరియా గోల్‌కీపర్ మొరటుగా అడ్డుకోవడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రో్టక్ లభించింది. దాన్ని రూపింద్ గోల్ చేయడంతో ఐదుషాట్లలో భారత్ 5 గోల్స్ సాధించింది. ఇక కొరియా తరఫున ఆ జట్టు కెప్టెన్ జంగ్ మాన్జీ, కిమ్ హెయాంగ్ జిన్, లీ జంగ్ జున్ వరుసగా మూడుషాట్లలో గోల్స్ చేశారు. నాలుగో షాట్ ఆడిన బీ జంగ్ సుక్‌ను శ్రీజేష్ మొరటుగా అడ్డుకోవడంతో కొరియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దాన్ని యాంగ్ జి హున్ గోల్ చేశాడు. చివరగా ఐదోషాట్‌ను లీ డీ ఇయోల్ ఆడగా.. బంతిని అద్భుతంగా అడ్డుకున్న శ్రీజేష్ భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ఇది నాలుగో సీజన్ కాగా.. భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరింది. 2011లో తొలిసీజన్లో విజేతగా నిలిచిన టీమిండియా.. 2012లో పాక్ చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.