
నిరాశాజనకమైన ఇంగ్లండ్ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టుల్లో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆ అవకాశం కల్పిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ తర్వాత రెండు మ్యాచ్‌ల సిరీస్ అంటే అర్థం లేనట్లుగా అనిపిస్తోంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా అభిమానుల ఆశలకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టసాధ్యంగా మారిపోయింది. అయితే ఐదు టెస్టులు సాధ్యం కాకపోతే కనీసం మూడు టెస్టులన్నా నిర్వహించాల్సింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సచిన్ వీడ్కోలు సిరీస్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుకంటే ప్రస్తుత టీమ్ చాలా పటిష్టంగా ఉంది. కొంత మంది టి20 స్టార్లు లేకపోయినా వెస్టిండీస్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది.
ఊహించినట్లుగానే భారత్ ఓపెనర్ల జోడీని మార్చబోతోంది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలలో ఎవరు అరంగేట్రం చేస్తారనేది రాజ్‌కోట్‌లోనే తేలుతుంది. సొంతగడ్డపై భారీ స్కోరు చేసేందుకు పుజారాకు ఇది మరో అవకాశం కాగా, ఇంగ్లండ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి అక్కడ చేజార్చుకున్న కొన్ని శతకాలను ఇక్కడ అందుకోవాలని భావిస్తుండవచ్చు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తమ దృష్టిలో టెస్టు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదని దీని ద్వారా సెలక్టర్లు చాటుకున్నారు. ఈ ఇద్దరు బౌలర్లూ తమకు విరామం కావాలని అడిగారా? నిజంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి దూరంగా ఉంచాల్సింది తప్ప టెస్టుల నుంచి కాదు. టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కచ్చితంగా బరిలోకి దిగాలి. వారిద్దరి గైర్హాజరు వల్ల శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. తమ సత్తా ఏమిటో ప్రదర్శించి ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు ఖాయం చేసుకునేందుకు ఈ యువ పేసర్లకు ఇది మంచి అవకాశం.
ఇంగ్లండ్‌తో తొలి నాలుగు టెస్టుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి భారత్ ఆ తర్వాత ఈ లెక్కను పక్కన పెట్టి చివరి టెస్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడింది. ఆఖరి టెస్టులో మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ రిషభ్ పంత్ అద్భుతంగా ఆడిన తీరు చూస్తే... అశ్విన్ నాలుగు సెంచరీలు కూడా వెస్టిండీస్‌పైనే చేశాడనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే మరోసారి భారత్ ఐదుగురు బౌలర్ల పాత వ్యూహాన్ని అమలు చేయవచ్చు. విండీస్‌తో 2013 టెస్టు సిరీస్ భారత్ దృష్టిలో మంచినీళ్ల ప్రాయంలా సాగింది. ఈ సిరీస్‌ను చాలా మంది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సన్నాహకంగా భావిస్తున్నా... మరీ అంత సులువుగా ఏమీ జరగదనేది నా అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment