‘ఐఎస్‌ఎల్‌కు గంగూలీ దూరం కారు’
కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నూతన అధ్యక్షుడిగా నియమితులైనా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కి సౌరవ్ గంగూలీ దూరమయ్యే ప్రసక్తే లేదని అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సంజీవ్ గోయెంకా తేల్చారు. ఈ ఫ్రాంచైజీలో గంగూలీ కూడా భాగస్వామి అనే విషయం తెలిసిందే. వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సీజన్‌లో దాదా పాత్ర ఉండదేమో అనే అనుమానాలను గోయెంకా తోసిపుచ్చారు. ‘గతేడాది కన్నా ఈసారి గంగూలీ ప్రాతినిథ్యం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? అట్లెటికో జట్టుకు ఆయన సేవలు ఎప్పటిలాగే అందుతాయి. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’ అని గోయెంకా అన్నారు.
కోల్‌కతా మ్యాచ్‌కు పీలే
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అక్టోబర్ 12న భారత్‌కు రానున్నారు. మర్నాడు జరిగే అట్లెటికో డి కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్‌ను ఆయన ప్రత్యక్షంగా వీక్షిస్తారు.ఈమేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపారు. ‘కోల్‌కతా తొలి హోమ్ మ్యాచ్ కోసం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులు, ఆటగాళ్లను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పీలే అన్నారు. 38 ఏళ్ల అనంతరం పీలే భారత్ వస్తుండటం విశేషం.