ఆసీస్ చితక్కొట్టుడు
కాన్బెర్రా:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించింది. న్యూజిలాండ్ తో మంగళవారం ఇక్కడ మనుకా ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్టేలియా 379 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా ఆరంభం నుంచి కివీస్పై విరుచుకుపడింది. తొలి వికెట్కు 68 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం చేసింది. ఓపెనర్ అరోన్ ఫించ్(19) తొందరగా అవుటైనా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(119;115 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించాడు. ఇది వార్నర్ కెరీర్లో 10వ వన్డే సెంచరీ కాగా, ఈ ఏడాది ఆరో సెంచరీ.
ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(72), ట్రావిస్ హెడ్(57), మిచెల్ మార్ష్(76 నాటౌట్)లు రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. వార్నర్-స్మిత్ల జోడి రెండో వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. ఆ తరువాత హెడ్-మార్ష్లు నాల్గో వికెట్కు 71 పరుగులు జోడించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇది ఈ స్టేడియంలో రెండో తొలి ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం. గతేడాది దక్షిణాఫ్రికా సాధించిన 411 పరుగులే ఇక్కడ అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోరు.