
సిడ్నీ: మరోసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన న్యూజిలాండ్‌ను ఆసీస్ స్పిన్నర్ లయన్ (5/68) మరోసారి దెబ్బతీశాడు. దాంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. గ్రాండ్‌హోమ్ (52; 5 ఫోర్లు, సిక్స్) కివీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రాస్ టేలర్ (7174) అవతరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లయన్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి మూడు పరుగులు చేయడం ద్వారా అంతకుముందు కివీస్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172) పేరు మీద ఉన్న ఈ రికార్డును సవరించాడు. ఫ్లెమింగ్ 189 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే... టేలర్‌కు 175 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 40/0తో సోమవారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్లకు 217 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వార్నర్ అజేయ శతకం (111 నాటౌట్; 9 ఫోర్లు)తో అలరించాడు. లబ్‌షేన్ (59; 3 ఫోర్లు) మరోసారి తన ఫామ్‌ను చాటుకున్నాడు. లబ్‌షేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది.