ద్రవిడ్, జహీర్లకు షాక్!
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లకు గట్టి షాక్ తగిలింది. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా నియమించబడ్డ ద్రవిడ్, జహీర్లకు అది మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోరినట్లే అసిస్టెంట్ కోచ్ గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ లను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతారని స్పష్టం చేసింది. మరొకవైపు ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ నియామకం కూడా దాదాపు ఖరారైనట్లే కనబడుతోంది.
ముందుగా సచిన్ , గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లను రవిశాస్త్రికి సహాయకులు నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సీవోఏ కూడా ద్రవిడ్, జహీర్ ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సీఏసీకి అప్పచెబితే, మరో ఇద్దర్ని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టింది. మరొకవైపు ప్రధాన కోచ్ కే సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి అండగా నిలిచింది. దాంతో అనేక తర్జన భర్జనల తరువాత సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ.. రవిశాస్త్రి కోరినట్లే భరత్ అరుణ్, సంజయ్ బంగర్లను ఎంపిక చేసింది. అయితే రాహుల్, ద్రవిడ్ లను విదేశీ కన్సల్టెంట్లుగా కొనసాగించాలనుకుంటే దానికి తాను అభ్యంతర చెప్పనని రవిశాస్త్రి తెలిపాడు. తనకు ఏమి కావాలో బుర్రలో ఉందన్నాడు. అయితే, ద్రవిడ్, జహీర్ లకు ఏమైనా బాధ్యతలు అప్పచెబుతారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.