ఎస్జీఎం రేపటికి వాయిదా
ముంబై: లోధా కమిటీ సూచించిన సిఫారుసుల అమలుకు సంబంధించి భేటీ అయిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం) ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే వాయిదా పడింది. ప్రధానంగా బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం 30 యూనిట్లు సమావేశానికి హాజరయ్యాయి. అయితే ఇందులో 10 యూనిట్లకు బీసీసీఐలో అధికారిక హోదా కల్పిస్తూ ఎటువంటి లేఖలు జారీ చేయకపో్వడంతో ఎస్జీఎంను రేపటికి వాయిదా వేశారు. లోథా సూచించిన ప్రతిపాదనల ప్రకారం ఆ పది యూనిట్లను అధికారికంగా స్వీకరిస్తూ మెమోరండమ్ జారీ చేయాల్సి వుంది. దీనికి శుక్రవారమే తుది గడువు. అయితే ఈ అంశంపై ఎటువంటి స్పష్టత లేకుండానే ఎస్జీఎంను వాయిదా వేశారు.
తమ కమిటీ సూచించిన ప్రతిపాదనలపై బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చీఫ్ అనురాగ్ ఠాకూర్ సహా మిగతా సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోధా కమిటీ సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీనిపై బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని అమలు చేయాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 6వ తేదీన జరిగే విచారణ నాటికి లోధా ప్రతిపాదనల అమలుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందు రెండే ఆప్షన్లు మిగిలి వున్నాయి. ఒకటి లోధా ప్రతిపాదనలు అమలు చేయడం?లేక పోరాటాన్ని కొనసాగించడం. రేపటి సమావేశంలో లోధా ప్రతిపాదనల అమలుపై కొంత వరకూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.