
నాకౌట్‌కు బెల్జియం
పన్నెండేళ్ల తర్వాత ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన బెల్జియం జట్టు నాకౌట్‌కు దశకు దూసుకెళ్లింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం రష్యాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది.
రష్యాపై 1-0తో విజయం
సూపర్ గోల్‌తో గెలిపించిన ఒరిజి
రియో డి జనీరో: పన్నెండేళ్ల తర్వాత ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన బెల్జియం జట్టు నాకౌట్‌కు దశకు దూసుకెళ్లింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం రష్యాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. డివోక్ ఒరిజి 88వ నిమిషంలో గోల్ చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. దీంతో గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బెల్జియం ప్రి క్వార్టర్స్‌కు చేరితే... ఓటమితో రష్యా తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో బెల్జియం... అల్జీరియాపై గెలుపొందగా, కొరియాతో మ్యాచ్‌ను రష్యా డ్రాగా ముగించింది.
ఇక ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. 10వ నిమిషంలో బెల్జియంకు తొలి చాన్స్ లభించింది. కార్నర్ నుంచి ఫెలైనీ అద్భుత షాట్ సంధించాడు. కానీ, దాన్ని తలతో ఆడిన వెర్మాలెన్.. గోల్‌పోస్ట్‌లోకి పంపించలేకపోయాడు. 12వ నిమిషంలో అది రష్యా వంతయింది.
ఆ తరువాత 14వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీ కిక్ లభించినా లుకాకు ప్రయత్నాన్ని ఇగ్నషెవిచ్ అడ్డుకున్నాడు. 20వ, 22వ నిమిషాల్లో మెర్టెన్స్ బంతిని చాకచక్యంగా రష్యా రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ లక్ష్యం దిశగా తీసుకెళ్లినా.. రెండుసార్లూ బంతి గోల్‌పోస్ట్‌కు దూరంగానే వెళ్లిపోయింది. 44వ నిమిషంలో గ్లుషకోవ్ అందించిన బంతిని హెడర్ గోల్ చేసేందుకు ప్రయత్నించిన కొకోరిన్ సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం 49వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను కూడా రష్యా గోల్‌గా మలచలేకపోయింది.
మధ్యలో ఇరుజట్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లపై దాడులు చేసినా కీపర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీంతో మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తుందనుకున్న తరుణంలో హజార్డ్ అందించిన బంతిని ఒరిజి.. రష్యా డిఫెండర్లకు, గోల్ కీపర్‌కు అందకుండా నెట్‌లోకి పంపించి బెల్జియం శిబిరంలో సంబరాలు నింపాడు. మిగిలిన కొద్ది నిమిషాల్లో రష్యా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.