'2019 ఏడాది నాకు ఎన్నో మధురానుభూతులు మిగిల్చాయి. కానీ నా తండ్రి ఏడాది చివర్లో అనారోగ్యానికి గురవ్వడంతో ఈ ఏడాదిని అదే సంతోషంతో ముగించలేకపోతున్నానంటూ' ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడడానికి ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న స్టోక్స్ తండ్రి గేడ్ అనారోగ్యంతో జోహన్నెస్‌బర్గ్‌లోని ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో డిసెంబర్ 26న బాక్సింగ్‌డే సందర్భంగా దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు మ్యాచ్ ఉండడంతో స్టోక్స్ తన తండ్రిని చూడడానికి వెళ్లలేదు. అయితే డిసెంబర్ 29న అతని తండ్రి జేడ్‌ను ఐసీయు నుంచి బయటికి తీసుకువచ్చారని తెలుసుకున్న స్టోక్స్ ఆ సమయంలో తన తండ్రి దగ్గర ఉండుంటే బాగుండేదని బాధను వ్యక్తం చేశాడు.
'నా తండ్రి అనారోగ్యానికి గురవడంతో.. ప్రపంచకప్ సాధించిపెట్టిన కీర్తి ప్రతిష్టలు, బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం కంటే తన తండ్రి ఆరోగ్యం 100శాతం మెరుగవడమే గొప్పగా భావిస్తానని' స్టోక్స్ ఒక పత్రికలో పేర్కొన్నాడు.అందుకే 2019 ఎన్నో మంచి అనుభూతులను ఇచ్చినా చివర్లో తన తండ్రి అనారోగ్యం పాలవడం జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు 2019 ఏడాది అద్భుతంగా గడిచిందనే చెప్పాలి. ఎందుకంటే 2019లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరు అంత తేలికగా మరిచిపోలేరు. తమ జట్టులో బెన్ స్టోక్స్ లాంటి నిఖార్సైన ఆల్‌రౌండర్ ఉంటే బాగుంటుందని క్రికెట్ ప్రపంచంలోని ప్రతీ జట్టు కోరుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ దశాబ్దంలోనే బెన్ స్టోక్స్ ఒక గొప్ప ఆల్‌రౌండర్ అంటూ కితాబివ్వడం విశేషం. పాంటింగ్ తాజాగా ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టులో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ జాబితాలో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 107 పరుగులతో విజయం సాధించి నాలుగు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది.
(చదవండి : క్రికెటర్ తండ్రి ఆరోగ్యం విషమం)
Comments
Please login to add a commentAdd a comment