భువనేశ్వర్ కుమార్
చెన్నై : షేన్ వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ..‘ఈ వికెట్‌పై మరిన్ని పరుగులు చేయాల్సింది. మా బౌలింగ్ సమయంలో మైదానంలో మంచు కురిసింది. కానీ మాకేం ఇబ్బంది కలుగలేదు. వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయాం. ఈ మ్యాచ్ క్రెడిట్ మొత్తం అతనిదే. ఇక ప్రతి బౌలర్‌కు ఎదో ఒకరోజు దుర్దినం వస్తుంది. అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్‌కు ఈ రోజు వచ్చింది. అతను గత మూడేళ్లలో ఎన్నడు లేని విధంగా ఓవర్‌కు 10 పరుగులు సమర్పించుకున్నాడు. మేం బెయిర్‌స్టో సేవలు కోల్పోతున్నాం. కానీ మా జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు. ఇంకా మాకు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇతర మైదానాల్లోనే ఉన్నాయి. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఆ మ్యాచ్‌లు గెలవాల్సిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపు కోసం సాయశక్తులా పోరాడుతాం. ఇక కెప్టెన్సీతో నేను చాలా నేర్చుకున్నాను.’ అని భువీ చెప్పుకొచ్చాడు.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్వదేశం వెళ్లడంతో షకీబుల్ హసన్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా.. భువనేశ్వర్ సారథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment