న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత, భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంపిక ప్రక్రియను మార్చాలని పేర్కొంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు శుక్రవారం లేఖ రాశాడు. ప్రస్తుతం అమలవుతోన్న విధానంలో వివక్ష ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రస్తుత విధానంలో అవార్డుల కోసం ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. అందులో నుంచి క్రీడా కమిటీ కొన్నింటిని ఎంపిక చేస్తుంది. ఈ ఎంపికను క్రీడా కమిటీ సభ్యులు ప్రభావితం చేయొచ్చు. ఇందులో పారదర్శకత లేదు’ అని అమిత్ లేఖలో రాసుకొచ్చాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఈ ప్రక్రియలో మార్పు రావాల్సిందే కాబట్టి అందుకు తానే ముందుకొచ్చానని అమిత్ తెలిపాడు.
ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ, ‘సాయ్’ అధికారుల దగ్గర అవార్డు నామినీల జాబితా ఉందని పేర్కొన్న అమిత్... ఎవరికి అవార్డు దక్కుతుందో, ఎవరికి దక్కదో వారికి తెలుసని పేర్కొన్నాడు. గతంలో రెండు పర్యాయాలు ‘అర్జున’ అవార్డు కోసం అమిత్ నామినేట్ అయినప్పటికీ డోపింగ్ ఆరోపణలతో అతని పేరు తిరస్కరణకు గురైంది. భారత్ తరఫున నిలకడగా రాణిస్తోన్న తనకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 2012లో చికెన్‌పాక్స్ చికిత్సలో భాగంగా తీసుకున్న ఔషధాల కారణంగా అమిత్ డోపింగ్‌లో పట్టుబడి ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. డోపింగ్ నేపథ్యమున్న క్రీడాకారులు జాతీయ క్రీడా పురస్కారాలకు అనర్హులని కేంద్ర క్రీడా శాఖ గతంలో పేర్కొనడంతో అమిత్‌కు జాతీయ క్రీడా అవార్డులు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment