రియో డి జనీరో: వువుజెలా.. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన గత ప్రపంచకప్‌లో ఈ బూరలు చేసిన హల్‌చల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మళ్లీ బ్రెజిల్‌లో అభిమానులకు సాకర్‌తోపాటు అటువంటి వినోదమే అందబోతోంది. వువుజెలాల స్థానంలో ‘డయాబొలికా’లతో స్టేడియాల్లో అభిమానులు సందడి చేయబోతున్నారు. బెల్జియంలో తయారైన డయాబొలికాకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. బ్రెజిల్‌లో అభిమానులు ఎగబడి మరీ వీటిని కొంటున్నారట. ఇప్పటికే లక్షల్లో డయాబొలికాలను అమ్మినట్లు తయారీదారులు చెబుతున్నారు. ఫిఫా ప్రపంచకప్ మొదలయ్యే సమయానికి వీటి అమ్మకాలు మరింతగా జరుగుతాయంటున్నారు. ఇక వువుజెలాలతో పోలిస్తే వీటి సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. స్టేడియంలోకి వీటిని సులువుగా తీసుకెళ్లవచ్చు. వువుజెలాల మాదిరిగా వీటి నుంచి పెద్ద శబ్దం రాదని, అలాగే చికాకు తెప్పించని చెబుతున్నారు. అంతేకాదు వీటి శబ్దం కూడా వినసొంపుగా ఉంటుందంటున్నారు. 2010 ప్రపంచకప్‌లో మ్యాచ్ జరిగిన ప్రతీచోట అభిమానులు వువుజెలాలతో సందడి చేశారు.
వీటి కారణంగా నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆటగాళ్లయితే వువుజెలాలతో తాము ఏకాగ్రతను కోల్పోతున్నామంటూ ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఫిఫా ప్రతినిధులు వీటిపై నిషేధం విధించలేకపోయారు. కారణం దక్షిణాఫ్రికాలో వువుజెలా అక్కడి సంప్రదాయంలో భాగమైపోయింది. డయాబొలికాలనుంచి వెలువడే శబ్ధం అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నా... ఆటగాళ్లు, నిర్వాహకులు ఏవిధంగా స్పందిస్తారో మరికొద్ది రోజ్లుల్లోనే తేలిపోనుంది.
అప్పుడు వువుజెలా.. ఇప్పుడు డయాబొలికా..
Published Thu, Jun 5 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement