మెకల్లోలమ్
64 బంతుల్లో 158 పరుగులు
ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీ
లండన్: తొలి ఐపీఎల్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 73 బంతుల్లో 158 పరుగులతో ఔరా అనిపించి లీగ్‌కు కూడా ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చాడు. ఇప్పుడు కౌంటీల్లో కూడా అదే రకం ఆటతీరుతో విరుచుకుపడి రికార్డు సృష్టించాడు. ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా శుక్రవారం డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడిన మెకల్లమ్... 64 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులు చేశాడు. ఇది ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
ఇందులో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండగా 42 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో వార్విక్‌షైర్ గెలిచింది. ఇంతకుముందు 2014లో ససెక్స్ ఆటగాడు ల్యూక్ రైట్ 153 పరుగులు సాధించాడు. అలాగే ఓవరాల్‌గా టి20 ఫార్మాట్‌లో తన పేరిటే ఉన్న రెండో అత్యధిక స్కోరును మెకల్లమ్ సమం చేసుకున్నాడు. తొలిస్థానంలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (175) ఉన్నాడు.