పేస్‌కు చోటు లభించింది కానీ...
న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టులో సీనియర్, దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌కు చోటు దక్కింది. అయితే మ్యాచ్‌లో బరిలోకి దిగే విషయాన్ని మాత్రం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి అప్పగించారు ‘ఐటా’ సెలక్టర్లు. సోమవారం సమావేశమైన ఎస్‌పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సెలక్షన్ కమిటీ ఆరుగురితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లున్నారు. రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గున్నెశ్వరన్, శ్రీరామ్ బాలాజీలను సింగిల్స్ కోసం ఎంపిక చేయగా... రోహన్ బోపన్న, లియాండర్ పేస్ డబుల్స్ ఆటగాళ్లు.
అయితే బరిలోకి దిగే నలుగురిని కెప్టెన్ మహేశ్ భూపతి నిర్ణయిస్తారని ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోరులో భాగంగా భారత్... ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. బెంగళూరులో వచ్చే నెల 7 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సరిగ్గా పది రోజుల ముందు తుది నలుగురు ఆటగాళ్లను భూపతి ఎంపిక చేసుకుంటాడని ఛటర్జీ పేర్కొన్నారు. మరో విజయం సాధిస్తే పేస్ డేవిస్ కప్ చరిత్రలో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.