బాంబు పేల్చిన మెక్ కల్లమ్
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బాంబు పేల్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ లోకి లాగేందుకు ప్రయత్నం జరిగిందని కోర్టుకు వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్ప్ తనను అడిగాడని తెలిపాడు.
2008, ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా లోని ఓ హోటల్ లో కలిసినప్పుడు తనను ఫిక్సింగ్ లోకి లాగేందుకు కెయిన్స్ ప్రయత్నించాడని, అయితే అతడి ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని లండన్ కోర్టులో వెల్లడించాడు. కెయిన్స్ ప్రతిపాదనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఫిక్సింగ్ చేయాలని అదే ఏడాది రెండుసార్లు తనను కెయిన్స్ కోరాడని తెలిపాడు.
స్పాట్ ఫిక్సింగ్ గురించి పేపర్ పై రాసి మరీ వివరించాడన్నాడు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్ కు 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశ పెట్టాడని వెల్లడించాడు. ఫిక్సింగ్ సొమ్ముతో కెయిన్స్ న్యూజిలాండ్ లో ఆస్తులు కూడబెట్టాడని తెలిపాడు. కెయిన్స్ వ్యవహారం గురించి 2011లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మెక్ కల్లమ్ చెప్పాడు.