
టోరెంటో : ఇండియా, పాకిస్తాన్, కరేబియన్ సంతతి వ్యక్తులతో కెనడా జనాభా పెరగడంతో అక్కడ క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఐపీఎల్ తరహాలోనే అక్కడ కూడా కెనడా ప్రీమియర్ లీగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత సంతతి వ్యాపార వేత్త రాయ్ సింగ్ ఈ క్రికెట్‌లీగ్‌ను ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మేరకు తన ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు.
‘ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంత కావడం చూశాను. ఇట్లాంటిదే కెనడా, అమెరికాలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. దీనికి సరియైన మౌళిక సదుపాయాలు అవసరం. వాటిని సమకూర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాను. నయాగారా జలపాతానికి కొద్ది దూరంలోనే 153 ఎకరాల భూమి కొంటున్నాము. అక్కడే ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలెట్టాము.’
‘ఇది ఖర్చుతో కూడుకున్న విషయం. కెనడా ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ ఏడాది 27 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 10 టీంలను రెండు గ్రూపులుగా విభజిస్తాము. క్రికెట్‌ను అభిమానించే, ఇష్టపడే వ్యాపారవేత్తగా టీ20 క్రికెట్‌ను పెద్ద వ్యాపారంగా చూస్తున్నాను. ఐపీఎల్ తరహాలో మ్యాచ్ బ్రాడ్‌కాస్టింగ్, అభిమానులను స్టేడియానికి రప్పించడం వంటివి ఖర్చుతో కూడి విషయాలు. టిక్కెట్లు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రొమోషన్స్, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు.’
‘ఒక్క అమెరికాలోనే 27 మిలియన్ల మంది ప్రీమియర్ లీగ్ చూస్తారని అంచనా ఉంది. ఈ లీగ్‌ను ఇండియా, కరీబియన్‌తో పాటు క్రికెట్ చూసే అన్నిదేశాలలో బ్రాడ్‌కాస్టింగ్ చేస్తాం. నాకు వివ్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్‌సన్, క్లైవ్ లాయిడ్, డినేష్ రాందిన్, డ్వేన్ బ్రావో తెలుసు. వాళ్లందరినీ తీసుకువచ్చి కెనడియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రొమోట్ చేస్తా. కెనడాలో మొదటి టీ20 మ్యాచ్ 2008 మేలో జరిగింది.’
‘నిజానికి క్రికెట్ చరిత్రలో మొదటి టెస్టు మ్యాచ్ 1844, సెప్టెంబర్ 25న జరిగింది. మూడు రోజుల పాటు కెనడా, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెనడా 23 పరుగుల తేడాతో గెలిచింది. కానీ క్రికెట్ రికార్డులో ఈ విషయం నమోదు కాలేదు. అధికారికంగా 1877 సంవత్సరం మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్, ఆసీస్ జట్ల మధ్య జరిగింది. 150 సంవత్సరాల క్రితం వరకూ కెనడా అధికార క్రీడ క్రికెట్..స్పోర్ట్ట్స్ గవర్నింగ్ బాడీ నుంచి క్రికెట్‌ను తొలగించే వరకూ. కెనడియన్ క్రికెట్ అసోసియేషన్ 1892లో ఏర్పాటు అయింది. 2008 లో కెనడియన్ ప్రభుత్వం ఒక జాతీయ క్రీడగా క్రికెట్‌ను గుర్తించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని’ అని రాయ్ సింగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment