మూడో రౌండ్‌లో చేతన్
న్యూఢిల్లీ: మూడుసార్లు జాతీయ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీల్లో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో చేతన్ 21-5, 21-15తో విశాల్ గార్గ్ (అస్సాం)పై గెలిచాడు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న చేతన్‌కు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రాహుల్ యాదవ్, త్రినాథ, అనీత్ కుమార్, ప్రశాంత్, ఎన్‌వీఎస్ విజేత కూడా మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. రెండో రౌండ్‌లో రాహుల్ యాదవ్ 16-21, 21-10, 21-10తో సుబ్రమణ్యం (తమిళనాడు)పై, త్రినాథ 21-11, 21-16తో సుబదన్బోర్ (మేఘాలయా)పై, అనీత్ కుమార్ 13-21, 21-16, 21-12తో అంకిత్ అరోరా (రాజస్థాన్)పై, ప్రశాంత్ 21-13, 21-14తో సంతోష్ (పాండిచ్చేరి)పై, విజేత 22-20, 21-14తో యష్ నైన్ (ఢిల్లీ)పై గెలిచారు.
వృశాలి, శ్రీ కృష్ణప్రియ ముందంజ
మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు వృశాలి, శ్రీ కృష్ణప్రియ, సంతోషి హాసిని, ప్రమద, హారిక, ఎం.పూజ, కె.వైష్ణవి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్‌లో వృశాలి 28-26, 21-7తో శీతల్ (ఉత్తరాఖండ్)పై, శ్రీ కృష్ణప్రియ 21-2, 21-11తో షెహనాజ్ ఖాన్ (పంజాబ్)పై, సంతోషి హాసిని 21-18, 21-10తో నిశ్చిత (కర్ణాటక)పై, ప్రమద 21-8, 21-11తో దక్ష గౌతమ్ (హర్యానా)పై, హారిక 21-5, 21-15తో సీహెచ్ పూర్ణిమ (ఆంధ్రప్రదేశ్)పై, పూజ 21-16, 21-16తో స్వాతి శర్మ (ఉత్తరాఖండ్)పై, వైష్ణవి 21-15, 23-21తో జ్యోతి (హర్యానా)పై విజయం సాధించారు. మంగళవారం క్వాలిఫయింగ్ రౌండ్‌లు పూర్తవుతాయి. పురుషుల, మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ విభాగాల నుంచి ఎనిమిది మంది చొప్పున మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. బుధ, గురువారాల్లో జాతీయ అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ జరుగుతుంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు పురుషుల సింగిల్, డబుల్స్; మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో మెయిన్ ‘డ్రా’ పోటీలు జరుగుతాయి.