విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజం
బ్రేవో, పొలార్డ్‌లకు మద్దతు
జొహన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్‌లకు చోటివ్వకపోవడాన్ని విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ తప్పుపట్టాడు. ఈ చర్య హాస్యాస్పదంగా ఉందని సెలక్టర్లపై ధ్వజమెత్తాడు. ‘ఆ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఎందుకుండకూడదు? బ్రేవో, పొలార్డ్ లేకుండా మాది పటిష్టమైన జట్టు అనిపించుకోదు. ఇది నిజంగా విచారకరం. ఇద్దరు కీలక ఆల్‌రౌండర్లను టోర్నీకి ముందే మేం కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.
దీని వెనుకాల చరిత్ర నాకు తెలీదు. కానీ నా దృష్టిలో అత్యంత చెత్త నిర్ణయం ఇది. వచ్చే ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉండేందుకు ఈ జట్టును ఎంపిక చేశారని బ్రేవో నాతో చెప్పాడు. అంటే ఈ వరల్డ్‌కప్‌ను గెలుచుకోవాల్సిన అవసరం లేదనా వారి ఉద్దేశం. మా క్రికెట్ ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. వన్డే ఫార్మాట్‌లో మా అతి పెద్ద ఆటగాళ్లు ఇద్దరు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లాల్సి ఉంది. ఇది మమ్మల్ని గాయపరిచింది’ అని గేల్ ఘాటుగా స్పందించాడు.