ఇక ఆటపై దృష్టి: హాడిన్ | Clarke headed in 'right direction' | Sakshi
Sakshi News home page

ఇక ఆటపై దృష్టి: హాడిన్

Published Sun, Dec 7 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

ఇక ఆటపై దృష్టి: హాడిన్

ఇక ఆటపై దృష్టి: హాడిన్

వరుసగా రెండో రోజు ఆసీస్ జట్టు ప్రాక్టీస్
జట్టుతో కలిసిన క్లార్క్
 
 అడిలైడ్: గత రెండు వారాలుగా భావోద్వేగ పరిస్థితుల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఎక్కువగా ఆలోచించి సమస్యలను జటిలం చేసుకోదల్చుకోలేదన్నాడు. వరుసగా రెండో రోజు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆసీస్ జట్టు నెట్స్‌లో బౌన్సర్లు వేయడం కాస్త తగ్గించింది. ‘ఇప్పుడే మళ్లీ క్రికెట్‌లోకి వచ్చాం.
 
 ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లందరూ కోరుకున్నారు. రాబోయే రెండు రోజులు బాగా శ్రమిస్తాం. ఆదివారం మాకు అత్యంత కీలకమైన రోజు’ అని హాడిన్ పేర్కొన్నాడు. శుక్రవారం సిడ్నీలో ఉన్న కెప్టెన్ క్లార్క్... శనివారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతని ఫిట్‌నెస్‌పై మాత్రం సందేహాలు వీడటం లేదు. మరోవైపు తొలి టెస్టుకు తాను సారథ్యం వహించడంపై ఆలోచించడం లేదని హాడిన్ వెల్లడించాడు. ‘మధ్యాహ్నం క్లార్క్ ప్రాక్టీస్‌కు వచ్చాడు. సెషన్‌లో బాగా ఆడాడు. కాబట్టి నాకు కెప్టెన్సీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. సుదీర్ఘకాలంగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన కెప్టెన్ కూడా. తొలి టెస్టులో తొలి గంట క్లార్క్ కెప్టెన్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు అడిలైడ్‌లో ఆడటంపై మాట్లాడుతూ... ‘వేదిక మారినప్పుడు ప్రణాళికలు కూడా మారుతాయి. ఈ పిచ్ కూడా బాగుంది.
 
 వేదిక గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా భావన. పరిస్థితులు ఎలా ఉన్నా ఆడటం మన బాధ్యత కాబట్టి. దాన్ని సమర్థంగా నిర్వహించాలి. మా తరహా క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. బౌన్సర్లు వేయాలా? వద్దా? అనేది క్లిష్టమైన అంశం. అయితే మాపై ఒత్తిడి ఉన్నా ప్రణాళిలకను మాత్రం అమలు చేస్తాం. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను చూపిస్తాం’ అని వైస్ కెప్టెన్ వివరించాడు.
 
 క్లార్క్‌కు మినహాయింపు
 తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడే అంశంలో క్లార్క్‌కు మినహాయింపు ఇచ్చారు. హ్యూస్ మృతితో కాస్త ఒత్తిడిలో ఉన్న అతను తొలి టెస్టులో ఆడతాడో లేదోనన్న సందిగ్ధం కూడా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టుకు ముందు రోజు కెప్టెన్లు మీడియాతో మాట్లాడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం క్లార్క్‌కు బదులుగా పేసర్ జాన్సన్ మాట్లాడతాడు.
 
 ఆసీస్ జట్టు జెర్సీపై ‘408’
 ఇటీవల మృతి చెందిన హ్యూస్‌కు నివాళిగా... భారత్‌తో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జెర్సీపై ‘408’ నంబర్‌ను ధరించనున్నారు. తమ సహచరుడి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో హ్యూస్ 408 ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. సాధారణంగా ప్రతి టెస్టు ఆటగాడికి వాళ్లు ధరించే జెర్సీపై వ్యక్తిగత నంబర్ ఉంటుంది. కానీ మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో ప్రతి ఆసీస్ ప్లేయర్ హ్యూస్ టెస్టు క్యాప్ నంబర్‌ను ధరించనున్నారు.  
 
 హ్యూస్ మృతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా అభిమానులు  అతడిని గుర్తు చేసుకుంటూ తమ ఇంటి ముందు క్రికెట్ బ్యాట్‌లను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఓ దొంగకు మాత్రం ఇదేమీ పట్టలేదు. ఒక ఇంటి ముందు ఉంచిన బ్యాట్‌ను ఎత్తుకుపోయాడు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement