
మొహాలి: వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘హిట్‌మాన్’ను పొడుగుతూ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ గౌరవార్థం అతడి ఫొటోతో భారత ప్రభుత్వం 200 రూపాయల నోట్లు ముద్రించాలని ఓ అభిమాని సలహాయిచ్చాడు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పిల్లల పెళ్లి నాటికి కూడా రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటారని వీరాభిమాని ఒకరు చమత్కరించారు.
పెళ్లిరోజున భార్య రితికకు రోహిత్ మర్చిపోలేని బహుమతి ఇచ్చాడని మరికొంత మంది మెచ్చుకున్నారు. మంచినీళ్లు తాగినంత సులువుగా ద్విశతకాలు బాదేస్తున్నాడని సంబరపడిపోయారు. నిలబడి అతడికి సెల్యూట్ చేయాలని మరికొందరు సూచించారు. రోహిత్ ఈ రోజు ఆడిన ఆట చాలా గొప్పగా ఉందని పలువురు క్రికెటర్లు ప్రశంసించారు. 110 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్.. తర్వాతి వంద పరుగులను కేవలం 35 బంతుల్లో పూర్తి చేయడం అద్భుతమని వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడు. రోహిత్ బ్యాటింగ్ చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తానని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ తదితరులు రోహిత్‌ను ప్రశంసించారు.
కాగా, మొహాలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన వెంటనే రోహిత్ శర్మ పేరు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. అతడిని అభినందిస్తూ ట్వీట్లు పోటెత్తాయి.